Share News

మూడు ఆస్పత్రులకు తీసుకెళ్తే.. మూడింటిపైనా బాంబులేశారు!

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:10 AM

ఇరాన్‌ ప్రస్తుత సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీని మార్చి 8నాటి అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఎలా కాపాడారన్నదానిపై న్యూయార్క్‌ పోస్ట్‌ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది.

మూడు ఆస్పత్రులకు తీసుకెళ్తే.. మూడింటిపైనా బాంబులేశారు!

  • శిథిలాల నుంచి వెలికితీసి మొజ్తబాకు చికిత్స

  • మార్చి 8 నాటి దాడులపై న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం

న్యూయార్క్‌, సెప్టెంబరు 27: ఇరాన్‌ ప్రస్తుత సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీని మార్చి 8నాటి అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఎలా కాపాడారన్నదానిపై న్యూయార్క్‌ పోస్ట్‌ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది. మొదటి దాడి తర్వాత ఆయన్ను మూడు ఆస్పత్రులకు తరలించారని, ఆయన్ను తరలించిన ప్రతీ ఆస్పత్రిపై అమెరికా బాంబులు వేసిందని వివరించింది. ఇరాన్‌కు చెందిన నాయకుడు హైదరీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారంటూ ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. మార్చి 8 అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా అప్పటి సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ నివాసంపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో అలీ ఖమేనీ చనిపోయారు. ఆయన కుమారుడు మొజ్తబా గాయపడ్డారు. మొజ్తబాను వెంటనే టెహ్రాన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అమెరికా ఆ ఆస్పత్రిపై బాంబు దాడి చేసింది. దీంతో, మరో ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మూడో ఆస్పత్రిపైన కూడా తీవ్రమైన బాంబుదాడులు జరిగాయి. దీంతో, ఆస్పత్రి భవనం కుప్పకూలింది. మొజ్తబాను శిథిలాల కింద వెతికి బయటికి తీయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఆయన్ను రహస్యంగా తరలించి చికిత్స అందించారు. కాగా, మార్చి 8నే మొజ్తబాను ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. ఇరాన్‌ ప్రభుత్వ టీవీలో అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఈ విషయం ఆయనుకు తెలిసింది. అప్పటికి ఆయన గాయాల నుంచి కోలుకోవడంతో సుప్రీం లీడర్‌ ఎన్నికపై ప్రకటన చేశారు.

Updated Date - Sep 28 , 2026 | 06:11 AM