అమెరికాకు చరిత్ర లేదు.. నాగరికత లేదు: ఇరాన్
ABN , Publish Date - Jul 05 , 2026 | 10:35 PM
మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన నేతలందరినీ ఒక్క దెబ్బకు కనుమరుగు చేయగలనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది.
ఇంటర్నెట్ డెస్క్: మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు వచ్చిన నేతలను ఒక్క దెబ్బకు కనుమరుగు చేయగలనంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని ఆర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రజల్ని ట్రంప్ చంపగలరేమో కానీ ఆదర్శాలు, ఆశయాలను అంతం చేయలేరని తేల్చి చెప్పింది.
‘ప్రజల్ని చంపవచ్చు కానీ ఆదర్శాలను అంతం చేయలేరు. మీరు అయతొల్లాను చంపేశారు. కానీ వాస్తవంగా జరిగిందేంటే ఒక సెంట్ బాటిల్ పగిలి పరిమళం అన్ని చోట్లకు వ్యాపించింది. కానీ మీకు ఇవన్నీ అర్థం కావు. ఎందుకంటే మీకు చరిత్ర, నాగరికత, గౌరవం లేవు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అంతకుముందు ట్రంప్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఖమేనీ అంత్యక్రియలకు వేల మంది హాజరు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వాళ్లందరూ ఖమేనీని ద్వేషించారని అనుకున్నా. అయితే వారి కన్నీళ్లు నటన కావొచ్చు. మిగిలున్న ఇరాన్ నాయకులందరూ అక్కడ ఉన్నారు. ఒక్క దెబ్బతో వారందరినీ మేము కనుమరుగు చేయగలము. కానీ అలా చేస్తే ఇరాన్‌తో చర్చలకు ఎవరూ మిగిలి ఉండరని వెనక్కు తగ్గాము’ అని అన్నారు.
ఇరాన్‌లో ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మోజ్తాబా మినహా మిగతా ముగ్గురు తనయులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. భారత అధికారులు సహా పలు దేశాల నాయకులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పలు కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఖమేనీ పార్థివదేహాన్ని జులై 9న ఖననం చేయనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు చిన్నారులతో సహా 8 మందికి గాయాలు..
టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. హాజరైన ముగ్గురు కుమారులు