Share News

అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. అవాక్స్ విమానం ధ్వంసం

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:12 PM

ఇటీవల ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో యూఎస్‌కు చెందిన అవాక్స్ నిఘా విమానం ధ్వంసమైంది.

అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. అవాక్స్ విమానం ధ్వంసం
US AWACS Plane Destroyed in Iran Missile Attack

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ మిసైల్ దాడుల్లో ఇటీవల అమెరికాకు చెందిన కీలక నిఘా విమానం ఒకటి ధ్వంసమైనట్టు వార్తలు వెలువడ్డాయి. మార్చి 27న సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్) అనే నిఘా విమానం ధ్వంసమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (AWACS Plane Destroyed in Missile Attack).

ఏమిటీ అవాక్స్ విమానం?

గగనతలంలో శత్రుదేశ విమానాలు, మిసైల్స్ వంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఈ విమానం ఉపయోగపడుతుంది. 1970ల్లో అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. ఈ విమానం దాదాపు 250 మైళ్ల వరకూ రాడార్ కవరేజీని ఇస్తుంది. కేవలం నిఘా విమానంగానే కాకుండా ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్‌ కూడా పనిచేస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక్కో విమానం ఖరీదు దాదాపు 700 మిలియన్‌ డాలర్ల వరకూ ఉంటుందని సమాచారం. ఇరాన్ జరిపిన తాజా దాడిలో అవాక్స్‌తో పాటు పలు కేసీ-135 ఏరియల్ రీఫ్యూలింగ్‌ టాంకర్లు కూడా దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ విమానాల సాయంతో యుద్ధ విమానాలకు గాల్లో ఉండగానే ఇంధనాన్ని నింపుతారు.


అవాక్స్ విమానం ధ్వంసం కావడంతో అమెరికా మిలిటరీ చర్యల మధ్య సమన్వయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గగనతల దాడులు చేయడం, శత్రుదేశ మిసైల్స్‌ను సమర్థవంతంగా ట్రాక్ చేయడంలో సవాళ్లు ఎదురుకావచ్చని అంటున్నారు. ఇక కొత్త అవాక్స్ విమానాన్ని సిద్ధం చేయడం కూడా అమెరికాకు కాస్త ఆలస్యమయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.


ఈ వార్తలూ చదవండి

గల్ఫ్ ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు పాక్ వేదికగా చర్చలు!

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం!

Updated Date - Mar 29 , 2026 | 06:14 PM