గల్ఫ్ ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు పాక్ వేదికగా చర్చలు!
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:55 PM
ఇరాన్‌పై యుద్దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పాక్ వేదికగా చర్చలు మొదలయ్యాయి. ఈజిప్ట్ విదేశాంగ శాఖ మంత్రి ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం అయ్యారు. త్వరలో ఆయన సౌదీ అరేబియా, తుర్కియే మంత్రులు, పాక్ ప్రధానితో కూడా సమావేశం కానున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా పాక్ వేదికగా ఆదివారం నుంచీ సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్ దేశాల మంత్రులు చర్చలు ప్రారంభించారు. ఈజిప్ట్ విదేశాంగ శాఖ మంత్రి బదర్ అబ్దెలాటీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్‌తో నేడు ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. త్వరలో ఆయన తుర్కియే విదేశాంగ శాఖ మంత్రి హకాన్ ఫిడాన్, సౌదీ విదేశాంగ శాఖ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్‌తో కూడా సమావేశం కానున్నారు. ఈ చర్చల పురోగతిపై ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కూడా చర్చించనున్నారు.
గల్ఫ్ ఉద్రిక్తతలకు తెరదించే దిశగా తాను మధ్యవర్తిత్వం నెరపుతానని పాక్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడితో తాను విస్తృత స్థాయిలో చర్చించానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవలే విలేకరులకు తెలిపారు.
మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇరాన్ మద్దతుదారులైన హౌతీలు (యెమన్) కూడా రంగంలోకి దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారింది. బాబ్-ఎల్-మండేబ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలను హౌతీలు టార్గెట్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక గల్ఫ్‌కు 3,500 మంది అమెరికన్ సైనికులను తరలించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. హోర్ముజ్ జలసంధి మీదుగా సరకు రవాణా నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో ఇప్పటికే చమురు ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనవుతోంది.
ఈ వార్తలూ చదవండి:
కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసంపై దాడి.. అమెరికా, ఐఆర్‌జీసీ పరస్పర విమర్శలు..
హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం!