హోర్ముజ్‌లో ఇరాన్ బోట్ల దండు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:43 AM
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఆ రెండు దేశాల నౌకాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ మార్గంలో....
నౌకా విధ్వంసక ఆయుధాలతో రహస్య మోహరింపు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తింపు
బాంబులు వేయడం కంటే ఆర్థిక దిగ్బంధనమే ఇరాన్‌పై అధిక ప్రభావం చూపుతోందని వెల్లడించిన ట్రంప్
మే 1వ తేదీతో యుద్ధానికి 60 రోజులు
కాంగ్రెస్ అనుమతిపై ట్రంప్‌కు గుబులు
వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 23: అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఆ రెండు దేశాల నౌకాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ దాడులు చేస్తుండగా, ఇరాన్ పోర్టులను అమెరికా నేవీ దిగ్బంధించింది. అయితే, ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ.. హోర్ముజ్‌లో ఇరాన్ భారీగా చిన్న బోట్లను మోహరించినట్లు తాజాగా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. నౌకా విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్ బోట్లను ఇరాన్ నౌకాదళం హోర్ముజ్ జలసంధిలోని ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించినట్లు ఓపెన్ సోర్స్ పరిశోధకుడు మెహదీ హెచ్ గురువారం తెలిపారు. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ బోట్లను మోహరించేందుకు పెద్దపెద్ద నౌకాశ్రయాలు అవసరం ఉండదు. సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్ వద్ద భారీగా ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నిర్వహిస్తోంది. కాగా, హోర్ముజ్ జలసంధిలో తాము తొలిసారి ఓ వాణిజ్య నౌక నుంచి టోల్ వసూలు చేసినట్లు పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ హమీద్ రెజా గురువారం ప్రకటించారు. ఆ డబ్బును తమ సెంట్రల్ బ్యాంకు ఖాతాలో జమచేశామని, దానిని ఇరాన్ పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
ట్రంప్ మెడపై 60 రోజుల గడువు కత్తి!
ఇరాన్‌ను తేలిగ్గా ఓడించి కాళ్ల బేరానికి తెచ్చుకుంటానని చెప్పి యుద్ధంలోకి దిగిన ట్రంప్.. ఇప్పుడు అందులోంచి బయటపడటం ఎలాగో తెలియక తలపట్టుకుంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏ దేశంపై అయినా యుద్ధం ప్రకటించే ముందు ఆ దేశ చట్టసభ అయిన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకోకుండా యుద్ధం ప్రకటిస్తే.. ఆ రోజు నుంచి 60 రోజుల్లోగా అనుమతి తీసుకోవాలి. ట్రంప్ ఎవరినీ సంప్రదించకుండానే ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టారు. మే 1వ తేదీతో యుద్ధం మొదలై 60 రోజులు పూర్తవుతుంది. దీంతో ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధాన్ని 30 రోజుల వరకు పొడిగించేందుకు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి కోరవచ్చు. అయితే, బలగాల ఉపసంహరణకు మాత్రమే అది వర్తిస్తుంది. లేదా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి యుద్ధాన్ని కొనసాగించవచ్చు. అయితే, ట్రంప్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు.. యుద్ధానికి ఆమోదముద్ర పడకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారు. పలువురు అధికార రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. యుద్ధం పొడిగింపునకు తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోనని రిపబ్లికన్ సెనేటర్ జాన్ కర్టిస్ స్పష్టంచేశారు. మే 1 తర్వాత యుద్ధం కొనసాగటానికి తాను మద్దతు ఇవ్వబోనని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ బ్రయాన్ మాస్ట్ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయంగా ఇబ్బందులను తప్పించుకోవాలంటే ఏకపక్షంగా వ్యవహరించకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లటమే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇరాన్ మాజీ యువరాజుపై టొమాటో సాస్‌తో దాడి
ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనను తీవ్రం గా వ్యతిరేకిస్తూ.. ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని స్వాగతించిన మాజీ యువరా జు రెజా పహ్లవీపై జర్మనీలో దాడి జరిగింది. బెర్లిన్‌లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించి.. కాల్పుల విరమణను తప్పుబట్టారు. ఇరాన్ పాలకులకు కోలుకునేందుకు అవకాశం ఇవ్వరాదని, దాడులు కొనసాగించాలని అమెరికా-ఇజ్రాయెల్‌కు సూచించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి వెనుక నుంచి ఆయనపై ఎర్రటి ద్రవాన్ని చల్లాడు. ఆయన అనుచరు లు వెంటనే తేరుకొని రెజా పహ్లవీని కారు ఎక్కించి అక్కడినుంచి పంపించివేశారు. ఈ ఘ టనపై జర్మనీ పోలీసులు స్పందిస్తూ.. ఆ ఎర్రటి ద్రవం టొమాటో సాస్ అని తెలిపారు.
ఆ నౌకలను ఇలా పట్టుకున్నాం
హోర్ముజ్ జలసంధిలో బుధవారం రెండు నౌకలను అదుపులోకి తీసుకుంటున్న వీడియోను ఐఆర్‌జీసీ గురువారం విడుదల చేసింది. భారత్‌కు వస్తున్న ఎపమినోడ్స్ నౌకతోపాటు ఎంఎ్‌ససీ ఫ్రాన్సిస్కా అనే కంటెయినర్ నౌకను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ముఖాలకు మాస్కులు ధరించిన కమెండోలు ఇరాన్ పతాకాలు ఉన్న స్పీడ్ బోట్లతో ఆ భారీ నౌకలను అడ్డగించి మొద ట కాల్పులు జరిపారు. తర్వాత భారీ ఆయుధాలతో నిచ్చెనల ద్వారా నౌకలపైకి ఎక్కి వాటిని స్వాధీనం చేసుకోవటం ఆ వీడియోలో కనిపించింది. తమ ఆదేశాలను లెక్కచేయకపోవటం వల్లే ఆ నౌకలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని ఐఆర్‌జీసీ ప్రకటించింది.

మందుపాతరలు పెట్టే నౌకలను పేల్చేయండి: ట్రంప్
నౌకాశ్రయాలను దిగ్బంధించినా ఇరాన్ దారికి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లో అసహనం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో సముద్ర మందుపాతరలు పెట్టే ఇరాన్ బోట్లను పేల్చివేయాలని తన నౌకాదళానికి గురువారం ఆయన ఆదేశాలిచ్చారు. బాంబులు వేయటం కంటే.. ఆర్థికంగా దిగ్బంధించటమే ఇరాన్‌పై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇరాన్‌తో చర్చలకు తొందరేం లేదని అన్నారు. నాలుగైదు రోజు వరకే కాల్పుల విరమణను పొడిగించారన్న వార్తలను ఆయన ఖండించారు. ఇరాన్ నేవీ ఇప్పటికే జలసంధిలో అనేక మందుపాతరలు నాటింది. వాటిని తొలగించేందుకు అమెరికా నేవీ ప్రయత్నిస్తోంది. జలసంధిలోని మందుపాతరలన్నీ తొలగించి.. వాణిజ్య రవాణాకు వీలు కల్పించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అమెరికా నేవీ ఆ దేశ చట్టసభ సభ్యులకు సమర్పించిన నివేదికలో తెలిపినట్లు సమాచారం. కాగా, ఇరాన్ చమురుతో వెళ్తున్న మెజెస్టిక్ ఎక్స్ అనే చమురు ట్యాంకర్‌ను హిందూమహా సముద్రంలో అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా నేవీ గురువారం ప్రకటించింది. మరోవైపు అమెరికా నౌకాదళం కార్యదర్శి జాన్ ఫెలన్‌ను ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.