Share News

హోర్ముజ్‌ జలసంధిలో ఒక్కో నౌకపై 2 మిలియన్ డాలర్లు.. ఇరాన్ ఛార్జీల వసూలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 09:00 AM

హోర్ముజ్ జలసంధి మీదుగా సరకు రవాణా నౌకలను అనుమతించేందుకు ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్ల చొప్పున ఇరాన్ ఛార్జీలు విధిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హోర్ముజ్‌ జలసంధిలో ఒక్కో నౌకపై 2 మిలియన్ డాలర్లు.. ఇరాన్ ఛార్జీల వసూలు
Strait of Hormuz - Iran Ship Passage Charges

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణానికి అనుమతించేందుకు ఒక్కో సరకు రవాణా నౌకపై 2 మిలియన్ డాలర్ల చొప్పున ఇరాన్ ఛార్జీలు విధిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని ఇరాన్ చట్టసభల సభ్యుడు ఒకరు స్వయంగా వెల్లడించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇది ఇరాన్‌‌కు ఉన్న అధికారమని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘యుద్ధం చేయాలంటే నిధులు కావాలి. కాబట్టి హోర్ముజ్ మీదుగా వెళ్లే సరుకు రవాణా నౌకల నుంచి మేము చార్జీలు తీసుకోకతప్పదు’ అని ఆయన పేర్కొన్నారట. ఈ పరిణామం షిప్పింగ్ కంపెనీలకు భారంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.


ప్రపంచ ఇంధన భద్రతకు హోర్ముజ్ జలసంధి ఆయువుపట్టుగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలో దాదాపు 20 శాతం ముడి చమురు, సహజవాయువు రవాణా ఈ జల మార్గం మీదుగా సాగుతుంటుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేసింది. నౌకలను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఈ మూసివేత కేవలం శత్రువులకేనని, మిత్రదేశాలకు కాదని కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇటీవల తెలిపారు. హోర్ముజ్ మీదుగా జపాన్ నౌకలను అనుమతిస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే, ఈ విషయమై ఇరు దేశాలు అధికారిక ప్రకటన ఏదీ ఇంకా విడుదల చేయలేదు. భారత్‌కు చెందిన కొన్ని నౌకలు కూడా ఇటీవల హోర్ముజ్ మీదుగా స్వదేశానికి చేరుకున్నాయి. ఒక పాక్ నౌకకు కూడా ఇటీవల అనుమతి లభించినట్టు తెలుస్తోంది.


ఇక హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోపు పూర్తిస్థాయిలో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఇరాన్‌కు డెడ్‌లైన్ విధించారు. చెప్పినట్టు చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్‌లపై దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మాత్రం ట్రంప్ హెచ్చరికలను తోసిపుచ్చారు. పశ్చిమాసియా దేశాల్లోని కీలక మౌలిక వసతులపై తామూ ప్రతీకార దాడులకు దిగుతామని తేల్చి చెప్పారు. హోర్ముజ్‌ జలసంధిలోని నౌకలపై ఇటీవల జరిగిన దాడుల్లో ఇటీవల ఒక భారతీయుడు కన్నుమూసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలూ చదవండి:

ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపు

తడబడుతూ నడక.. ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన!

Updated Date - Mar 23 , 2026 | 09:42 AM