అమెరికా రెస్టారెంట్‌లో కాల్పులు.. రియల్ హీరోల వీడియో రిలీజ్ చేసిన పోలీసులు..
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:24 AM
అమెరికా, ఇడాహోలోని ఇన్ అండ్ అవుట్ బర్గర్ రెస్టారెంట్‌లో కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. నలుగురు రియల్ హీరోల కారణంగా ప్రాణ నష్టం తగ్గిందని అన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా, ఇడాహోలోని ఇన్ అండ్ అవుట్ బర్గర్ రెస్టారెంట్‌లో కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. నలుగురు రియల్ హీరోల కారణంగా ప్రాణ నష్టం తగ్గిందని అన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హంతకుడు 24 ఏళ్ల చాడ్ విలియమ్స్ కారులో రెస్టారెంట్ వద్దకు వచ్చాడు. డ్రైవ్ థ్రూ విండో నుంచి రెస్టారెంట్‌లోని వారిపై కాల్పులు జరిపాడు. దీంతో ఓ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చాడ్ రెస్టారెంట్ లోపలికి వెళ్లకుండా.. పార్కింగ్ ప్లేస్, పక్కనే ఉన్న బిజీ రోడ్డు, సమీపంలోని కార్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఉన్నవారిపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినబడగానే ఏజే జేమ్స్ అనే మాజీ పోలీసు అధికారి తన ప్రాణాలకు తెగించి నిందితుడి వైపు పరిగెత్తాడు. చాడ్‌పై ఎదురు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో జేమ్స్‌కు బులెట్ గాయం అయింది. అయినా జేమ్స్ భయపడలేదు. చాడ్‌ను రెస్టారెంట్ లోపలికి రాకుండా అడ్డుకునేందుకు ఎదురు కాల్పులు కొనసాగించాడు. మరో వ్యక్తి కూడా చాడ్‌పై ఎదురు కాల్పులు జరిపి అతడిని రెస్టారెంట్ వైపు రాకుండా అడ్డుకున్నాడు.
చాడ్ వారి నుంచి తప్పించుకుని పక్కకు వచ్చేశాడు. రెస్టారెంట్ దగ్గర ఉన్న కస్టమర్లపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే దగ్గరిలోని స్టోర్‌లో పని చేసే బ్రాక్స్టన్ స్ట్యూబ్ అనే వ్యక్తి చాడ్‌ను నిలువరించాడు. ‘నాకు కుటుంబం ఉంది, దయచేసి కాల్చకు’ అని బతిమలాడుతూ నిందితుడి దృష్టి మళ్లించాడు. అయినా కనికరించని నిందితుడు అతడిపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. బ్రాక్స్టన్ స్ట్యూబ్ బులెట్ నుంచి తప్పించుకున్నాడు.
ఈ లోపు మిగతా వారు అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారు. చాడ్ విలియమ్స్ కాల్పులు జరుపుతున్న సమయంలో రెస్టారెంట్ లోపల విధుల్లో లేని ఓ పోలీస్ అధికారి ఉన్నారు. ఆయన ఎంతో సమయస్ఫూర్తితో నిందితుడిపై ఎదురు కాల్పులు జరుపుతూ, లోపల ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపించగలిగారు. నలుగురు రియల్ హీరోల కారణంగా ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని పోలీసులు తెలిపారు. పది మందిపై కాల్పులు జరిపిన తర్వాత చాడ్ విలియమ్స్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని వెల్లడించారు. చాడ్ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి