అది సుంకాల ఎఫెక్ట్.. భారతీయ స్టీల్‌ప్లాంట్‌పై యూఎస్ మంత్రి కామెంట్
ABN , Publish Date - Sep 29 , 2026 | 09:43 AM
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం కారణంగానే భారతీయ కంపెనీ అమెరికాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత పారిశ్రామిక దిగ్గజం ఎస్సార్ గ్రూప్ ఐయోవా రాష్ట్రంలో (యూఎస్) 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా శ్వేతసౌధంలో ఎస్సార్ గ్రూపు ప్రతినిధుల సమక్షంలో తాజాగా ఆవిష్కరించారు. ఈ పరిణామంపై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పందించారు. ఇదంతా ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం అని అన్నారు. సుంకాల విధింపు లేకుండా స్టీల్ ప్లాంట్ అమెరికాలో ఏర్పాటయ్యేదే కాదని చెప్పుకొచ్చారు. ‘మనం విధిస్తున్న 232 రకాల సుంకాల ఎఫ్టెక్ ఇదీ. స్టీల్ సుంకాల ప్రభావం కనిపించింది. ఇవి లేకుండా అమెరికాలో గనుల అభివృద్ధి, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు’ అని మంత్రి అన్నారు. అమెరికాలో తయారీ పరిశ్రమను పునరుద్ధరించేందుకు ట్రంప్ గతేడాది స్టీల్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే.
ఎస్సార్ గ్రూప్ ప్రాజెక్టుతో అమెరికాకు ఐరన్ ఓర్ పెల్లెట్ల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అధికశాతం పెల్లెట్స్‌ను యూఎస్ బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటోందని అన్నారు. దీంతో, అమెరికాలో స్టీల్ తయారీకి విదేశాలపై ఆధాపడుతున్నామని చెప్పారు. ‘ప్రస్తుతం మనం మిన్నెసొటాలో ఇనుము గనిని అభివృద్ధి చేసుకున్నాము. అక్కడి నుంచి ముడి ఖనిజం నేరగా ఐయోవాలోని స్టీల్ ప్లాంట్‌కు వెళుతుంది’ అని అన్నారు.
ఎస్సార్ గ్రూపు ప్రాజెక్టుతో అమెరికా తయారీ రంగానికి గొప్ప ఊతం లభిస్తుందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తమకు సహకరించినందుకు ఎస్సార్ చైర్మన్ రేవంత్ రూయియా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.
మిన్నెసొటాలోని ఇనుప గని అభివృద్ధికి ఎస్సార్ గ్రూప్ సంస్థ మెసాబీ మెటాలిక్స్ ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇక్కడి నుంచి వెలికి తీసే ఖనిజాన్ని ఐయోవాలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు తరలించి స్టీల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 2030 నుంచి స్టీల్ ఉత్పత్తిని ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక స్థానికంగా 1,750 మందికి శాశ్వత ఉపాధి లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తొలి దశలో సుమారు 7 వేల మంది నిర్మాణ నిపుణులకు ఉపాధి లభించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్
అప్‌గ్రేడెడ్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్