ఎఫ్-35 జెట్‌ను ఇరాన్ గుర్తించగలిగిందా? నిపుణుల అభిప్రాయం ఇదీ
ABN , Publish Date - Apr 03 , 2026 | 09:08 PM
రాడార్ వ్యవస్థకు అంత సులభంగా చిక్కని ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చేసిందన్న కథనాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అసలు ఇది ఎలా సాధ్యమనే విషయంలో నిపుణులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాడార్ సిగ్నల్స్‌కు అంత సులభంగా చిక్కని ఫైటర్ జెట్‌గా పేరుపొందిన ఎఫ్-35ని ఇరాన్ గగనతల వ్యవస్థలు కూల్చేశాయన్న వార్తలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ విషయాలపై యూఎస్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిలిటరీ రంగ నిపుణులు పలు కీలక కామెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని అనుసరించి ఎఫ్-35ల జాడను కనుగొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఏమిటీ వ్యూహం
సాధారణంగా ఫైటర్ జెట్‌లను గుర్తించేందుకు రాడార్ వ్యవస్థలను వినియోగిస్తారు. ఈ వ్యవస్థలు వెలువరించే రాడార్ సిగ్నల్స్‌ను విమానాలు ప్రతిఫలించినప్పుడు వాటి జాడ రాడార్ స్క్రీన్‌లపై కనిపిస్తుంది. అయితే, రాడార్ తరంగాలను ప్రతిఫలించకుండా ఉండేలా ఎఫ్-35 యుద్ధ విమానాలను అమెరికా ప్రత్యేకంగా డిజైన్ చేసింది. రాడార్ సిగ్నల్స్‌ను గ్రహించే రాడార్ అబ్జార్బెంట్ పాదార్థాన్ని ఫైటర్ జెట్స్‌పై పూతగా పూస్తారు. ఫలితంగా ఈ విమానాలను రాడార్‌లు అంత సులువుగా గుర్తించలేవనేది నిపుణులు చెప్పేమాట. అంతే కాకుండా, రాడార్ సిగ్నల్స్‌కు చిక్కని విధంగా విమానం డిజైన్‌లో కూడా అనేక మార్పులు ఉంటాయి.
ఇరాన్ మాత్రం సాధారణ రాడార్‌లను వినియోగించకుండా కేవలం ప్యాసివ్ ట్రాకింగ్ విధానంలో అమెరికన్ విమానాల జాడ కనుక్కుంటూ ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అంటే, విమానం వెళుతున్నప్పుడు పరిసరాల్లోని రేడియో, కమ్యూనికేషన్ సిగ్నల్స్‌లో మార్పులను గమనిస్తూ విమానం జాడను అంచనా వేస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా, విమానం ఇంజిన్ వెలువరించే వేడి (ఇన్‌ఫ్రారెడ్ సిగ్నేచర్) ఆధారంగా కూడా ఫైటర్ జెట్‌ల జాడను కనిపెడుతున్నట్టు అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ వ్యూహాలతో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేందుకు బలమైన ఆధారాలు లేవని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఇలా ప్యాసివ్ విధానంలో అమెరికా విమానాలను గమనిస్తుండటంతో అమెరికన్ పైలట్‌లకు తమను ఎవరైనా గమనిస్తున్నారన్న విషయం కూడా తెలియపోవచ్చని చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే స్టెల్త్ ఫైటర్ జెట్లకు కొత్త సవాళ్లు తప్పవని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్యాసివ్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికి కొత్త వ్యూహాలు రూపొందించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచగలం: రష్యా
ఇరాన్‌కు చిక్కిన యూఎస్ ఫైటర్ జెట్ పైలట్.. మీడియాలో సంచలన కథనం