భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచగలం: రష్యా
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:58 PM
భారత్‌కు ముడి చమురు, సహజవాయువు సరఫరాను పెంచే సామర్థ్యం తమ కంపెనీలకు ఉందని రష్యా ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ డెనిస్ మంటురావ్ తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాలో తీవ్ర ఆటంకాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ అవసరాల మేరకు ముడి చమురు, సహజవాయువు సరఫరాను పెంచగలిగే సామర్థ్యం తమ కంపెనీలకు ఉందని రష్యా శుక్రవారం తెలిపింది. తాజాగా భారత పర్యటన సందర్భంగా రష్యా ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ డెనిస్ మంటురావ్ ఈ విషయాన్ని తెలిపారు. పెరుగుతున్న భారత ఇంధన అవసరాలకు అనుగుణంగా సరఫరా పెంచగలిగే సామర్థ్యం తమ కంపెనీలకు ఉందని ఆయన అన్నారని భారత్‌లోని రష్యన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
2025 చివరి నాటికే రష్యా కంపెనీలు భారత్‌కు మినల్ ఫర్టిలైజర్ సరఫరాను 40 శాతం మేర పెంచాయని డెనిస్ తెలిపారు. భారత్- రష్యాల భాగస్వామ్యం ఇంధన రంగానికే పరిమితం కాదని అన్నారు. భారత్ ఇంధన అవసరాల మేరకు సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగానే ఉందని తెలిపారు. అణు ఇంధన రంగాల్లో కూడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్, రష్యాలు కృషి చేస్తున్నాయని కూడా డెనిస్ తెలిపారు. కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అదనపు పవర్ యూనిట్ల ఏర్పాటుపై కూడా పనులు ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయని అన్నారు. యూరియా ఉత్పత్తి కోసం ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుపై పనులు కొనసాగుతున్నాయని కూడా డెనిస్ తెలిపారు.
భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్‌కు కోచైర్‌గా వ్యవహరిస్తున్న డెనిస్.. భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో కూడా సమావేశమయ్యారు. వాణిజ్యం, కనెక్టివిటీ, టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ తదితర అంశాలపై చర్చించారు. 2025లో భారత్-రష్యా వార్షిక సమావేశాల తరువాత చోటుచేసుకున్న పురోగతిపై కూడా సమీక్ష జరిపారు.
ఇరాన్‌కు చిక్కిన యూఎస్ ఫైటర్ జెట్ పైలట్.. మీడియాలో సంచలన కథనం
చైనాకు చుక్కెదురు.. భారీ రాకెట్ ప్రయోగం విఫలం