స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ కలకలం! 90 రోజుల్లో 3,700 లావాదేవీలు
ABN , Publish Date - May 18 , 2026 | 12:27 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాక్ మార్కెట్ లావాదేవీలపై అంతర్జాతీయ మీడియాలో వెలువడిన కథనాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇంతటి స్థాయిలో డీలింగ్స్‌ను తామెప్పుడూ చూడలేదని పలువురు స్టాక్ ట్రేడర్స్ కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో అక్కడి స్టాక్ మార్కెట్స్‌లో జరిపిన లావాదేవీలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాలను అక్కడి మీడియా తాజాగా బయటపెట్టింది. ఈ లావాదేవీల్లో చట్టవ్యతిరేకమైనవేవీ లేకపోయినప్పటికీ ఇంతటి భారీ స్థాయిలో దేశాధ్యక్షుడు ట్రేడింగ్ జరపడం చూసి తలలు పండిన ట్రేడర్స్ కూడా ఆశ్చర్యపోతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
మీడియా కథనాల ప్రకారం, టెక్నాలజీ, ఫైనాన్స్, ఎయిరోస్పేస్, మీడియా రంగాలకు చెందిన పలు టాప్ కంపెనీల షేర్లతో ట్రంప్ మిలియన్ల డాలర్ల ట్రేడింగ్ జరిపారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో సగటున రోజుకు 40 లేవాదేవీలకు వరకూ చేశారు. గతేడాది ఇదే కాలంలో ట్రంప్ కేవలం 380 ట్రేడ్స్‌ను మాత్రమే నిర్వహించారు. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ లావాదేవీలు అసాధారణమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తన 40 ఏళ్ల కెరీర్‌లో ఈ స్థాయి ట్రేడింగ్‌ను ఎప్పుడూ చూడలేదని ది వెల్త్ అలయన్స్ సంస్థ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎరిక్ డైటన్ తెలిపారు.
ఎన్‌విడియా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, కాస్ట్‌కో సంస్థలకు చెందిన మిలియన్ డాలర్ల విలువైన షేర్లతో ట్రంప్ ట్రేడింగ్‌ను నిర్వహించినట్టు వెలుగులోకి వచ్చింది. అమెజాన్, మెటా, ఉబెర్, ఈబే, ఏటీ అండ్ టీ, డాలర్ ట్రీ సంస్థల షేర్లతో కూడా ట్రంప్ ట్రేడింగ్ చేశారు. మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌కు చెందిన దాదాపు 25 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఫిబ్రవరి 10న ట్రంప్ విక్రయించినట్టు వెలుగులోకి రావడం అనేక మందిని నోరెళ్లబెట్టేలా చేసింది. నెట్‌ఫ్లిక్స్, వార్నర్స్ బ్రదర్స్, డిస్కవరీ, పారామౌంట్ వంటి ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగ సంస్థల షేర్లతో కూడా ట్రంప్ లావాదేవీలు నిర్వహించారు.
ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ప్రభావితం చేస్తుండటంతో ట్రంప్ డీలింగ్స్ పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదాహరణకు అత్యాధునిక ఏఐ చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసేందుకు ఎన్‌విడియాకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఇక బోయింగ్ లాంటి సంస్థలు ప్రభుత్వ కాంట్రాక్టులపై ఎక్కువగా ఆధారపడుతుంటాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై యాంటీట్రస్టు విచారణలు, ఏఐ నైతికతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక మునుపటి అమెరికా పాలకులు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు వివిధ వ్యాపారాల్లో తమ వాటాను స్వతంత్ర ట్రస్టులకు మళ్లించారు. మరికొందరు వాటాలను విక్రయించారు. అయితే, వ్యాపారాల్లో తన వాటాను ట్రంప్ ఇప్పటికీ పూర్తిగా విక్రయించలేదని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్..
డచ్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్! అవగాహన లేదంటూ..