Share News

డచ్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్! అవగాహన లేదంటూ..

ABN , Publish Date - May 18 , 2026 | 10:11 AM

భారత్‌లో ప్రజాస్వామ్యం, మైనారిటీ హక్కులపై డచ్ ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అవగాహన రాహిత్యం కారణంగా భారత్‌పై సందేహాలు వస్తుంటాయని చెప్పింది.

డచ్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్! అవగాహన లేదంటూ..
MEO on Dutch PM Remarks

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో మీడియా స్వేచ్ఛ, మైనారిటీ హక్కులకు రక్షణ తగ్గుతోందంటూ నెదర్‌లాండ్స్ (డచ్) ప్రధాని రాబ్ జెట్టిన్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. అద్భుతమైన భారత ప్రజాస్వామ్యం అందరికీ భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోందని పేర్కొంది. భారత సంస్కృతి లోతైనదని వ్యాఖ్యానించింది. భారత్‌లో విభిన్నత్వంపై అవగాహనారాహిత్యం ఇలాంటి వ్యాఖ్యలకు కారణమవుతోందని స్పష్టం చేసింది.

‘ఇలాంటి ప్రశ్నలు తరచూ ఉత్పన్నం అవడానికి కారణం ప్రశ్నలు అడిగే వారికి భారత్‌పై అవగాహన లేకపోవడమే’ అని విదేశాంగ శాఖ సెక్రటరీ సిబీ జార్జ్ అన్నారు. భారత నాగరికత 5 వేల ఏళ్ల నాటిదని చెప్పారు. సంస్కృతి పరంగా, మతపరంగా, భాషాపరంగా భారత్ ఎంతో వైవిధ్యమైన దేశమని చెప్పారు. హైందవం, బౌద్ధం, జైనమతం, సిక్కు మతం.. ఇలా నాలుగు మతాలు ఆవిర్భవించిన దేశం ప్రపంచంలో భారత్ మినహా మరొకటి లేదని అన్నారు. ఇప్పటికీ భారత్‌లో ఇవి కొనసాగుతున్నాయని చెప్పారు. 2500 ఏళ్లుగా భారత్‌లో యూదు మతం ఉందని, ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోందని అన్నారు. యూదులు వివక్ష ఎదుర్కోని అతికొన్ని దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు. క్రీస్తు పునరుత్థానం చెందిన కొద్ది కాలానికే క్రైస్తవం భారత్‌లోకి ప్రవేశించిందని అన్నారు. మహ్మద్ ప్రవక్త కాలంలోనే భారత్‌కు చేరుకున్న ఇస్లామ్ మతం ఇప్పటికీ సుభిక్షంగా కొనసాగుతోందని చెప్పారు.


భారత్ స్వాతంత్ర్యం పొందిన సమయానికి దేశంలో మైనారిటీల జనాభా 11 శాతమని చెప్పారు. ప్రస్తుతం 20 శాతానికి చేరుకుందని అన్నారు. మైనారిటీల జనాభా పెరిగిన దేశం ప్రపంచంలో భారత్ మినహా మరొకటి లేదని అన్నారు. పేదరికం నిర్మూలన కోసం తాము ఎలాంటి హింసాత్మక చర్యలు చేపట్టలేదని కూడా గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పేదరికాన్ని నిర్మూలిస్తున్నామని చెప్పారు.

ప్రధాని మోదీతో సమావేశానికి ముందు డచ్ ప్రధాని భారత్‌లో మీడియా స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల గురించి విలేకరులతో మాట్లాడినట్టు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ‘కేవలం మీడియా స్వేచ్ఛ మాత్రమే కాదు, మైనారిటీ హక్కుల గురించి కూడా మేము భారత్ ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తాము. ప్రస్తుతం పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది’ అని డచ్ ప్రధాని అన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, భారత్, నెదర్‌లాండ్స్ ప్రజాస్వామ్యానికి అత్యధిక విలువనిచ్చే దేశాలని డచ్ ప్రధాని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 18 , 2026 | 11:26 AM