డొనాల్డ్ ట్రంప్ మరో పోస్టు.. ఆ రాష్ట్రం పేరునూ మార్చేస్తారా?
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:57 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. యూఎస్ఏలోని న్యూమెక్సికో రాష్ట్రం పేరును న్యూ అమెరికాగా మార్చాలన్న ప్రతిపాదనకు అద్దం పట్టే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. యూఎస్ఏలోని న్యూమెక్సికో రాష్ట్రం పేరును న్యూ అమెరికాగా మార్చాలన్న ప్రతిపాదనకు అద్దం పట్టే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ రాష్ట్రం పేరులోని మెక్సికో పదాన్ని కొట్టేసి అమెరికా పేరు రాసున్న మ్యాపును నెట్టింట పంచుకున్నారు. దీంతో, ఈ అంశం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఇటీవల కాలంలో ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చిన విషయం తెలిసిందే. కెనడా సరిహద్దు వద్ద ఉన్న మరో సరస్సుకు కూడా లేక్ అమెరికా అని పేరు మార్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు, హోర్ముజ్ జలసంధిని ట్రంప్ స్ట్రెయిట్‌గా పిలిస్తే బాగుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే యూఎస్‌లోని న్యూమెక్సికో రాష్ట్రం పేరు మార్పు అంశం సెటైరికల్‌గా తెరపైకి వచ్చింది. న్యూమెక్సికో పేరును న్యూ అమెరికాగా మార్చేస్తే పోలా అని ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ అనేక మంది కామెంట్ చేశారు. ఈ ట్రెండ్‌పై ట్రంప్ తాజాగా నెట్టింట స్పందించారు. ఐడియా తనకు బాగా నచ్చిందన్నట్టు రాష్ట్రం పేరును కొట్టేసి ఉన్న మ్యాపును షేర్ చేశారు. ఇదే మ్యాపును శ్వేత సౌధం కూడా రీపోస్టు చేసింది.
ఈ పోస్టుపై న్యూమెక్సికోలో ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేత మిషెల్ గ్రీషమ్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ యుద్ధం నుంచి, దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ట్రంప్ ఇలా చేశారని ఆరోపించారు. అసలు ఈ అంశంపై చర్చే అనసరమని తేల్చి చెప్పారు. మ్యాపులకు రంగులేస్తూ శ్వేతసౌధం సమయం వృథా చేస్తుంటే తాము మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పారు. ఇక అమెరికాలోని రాష్ట్రాల పేర్లను మార్చే అధికారం అధ్యక్షుడికి ఉండదని అక్కడి రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పోర్నోగ్రఫీపై పన్నుతో యుద్ధ నిధుల సమీకరణ.. ఉక్రెయిన్ యోచన
అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన కార్గో విమానం.. ఐదుగురి మృతి..