అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన కార్గో విమానం.. ఐదుగురి మృతి..
ABN , Publish Date - Sep 07 , 2026 | 07:28 AM
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్గో విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్గో విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మియామీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అమెజాన్ కార్గో విమానం ప్యూర్టో రికోలోని సాన్ జువాన్ నుంచి మియామీ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపైకి వచ్చింది.
రన్‌వేపై వెళుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా అదుపుతప్పింది. వాహనాలను ఢీకొడుతూ ముందుకు దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ఫైర్, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
గాయపడ్డవారిని రెస్క్యూ టీమ్ ఆస్పత్రికి తరలించింది. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. అమెజాన్ కార్గో విమానం వేగంగా వాహనాలపైకి దూసుకొచ్చింది. కొన్ని సెకన్ల తర్వాత ఆగిపోయింది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
ఇవి కూడా చదవండి
వినికిడి లోపంతో ఏటా 8 లక్షల కోట్ల నష్టం!
అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే!