అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే!
ABN , Publish Date - Sep 07 , 2026 | 07:23 AM
విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలపై అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. విదేశీ కార్మికులకు అనుకూలంగా అమెరికన్ల పట్ల వివక్ష చూపిస్తే ఆయా కంపెనీలు స్ర్కూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫెడరల్ అధికారులు హెచ్చరిస్తున్నారు
నియామకాల్లో వివక్ష చూపితే స్ర్కూటినీ
పౌర హక్కుల చట్టాలను ప్రయోగిస్తాం
కంపెనీలపై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి
వాషింగ్టన్, సెప్టెంబరు 6: విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలపై అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. విదేశీ కార్మికులకు అనుకూలంగా అమెరికన్ల పట్ల వివక్ష చూపిస్తే ఆయా కంపెనీలు స్ర్కూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫెడరల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని అమెరికా కార్మిక విభాగం ఐజీ ఆంథోనీ ఎస్పోసిటో శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. ‘అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్ కార్మికుల కోసమే, కార్పొరేట్ స్కీమ్‌ల కోసం కాదు’ అని పోస్టులో రాశారు. ఈ సందర్భంగా అమెరికా న్యాయ విభాగం అటార్నీ జనరల్ (పౌర హక్కులు) హర్మీత్ ధిల్లాన్ తాజాగా చేసిన కామెంట్లతో కూడిన బ్రైట్‌బార్ట్ వార్తా నివేదికను షేర్ చేశారు. అమెరికన్ కార్మికుల పట్ల ఉపాధి వివక్షకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై దర్యాప్తును న్యాయ విభాగం ముమ్మరం చేసిందని ధిల్లాన్ అందులో పేర్కొన్నారు. కొత్త కార్మిక వివక్ష కేసులన్నింటిలోనూ దాదాపుగా అమెరికన్ల పట్ల వివక్ష జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. జాతీయత లేదా జాతీయ మూలం ఆధారంగా కంపెనీ యాజమాన్యాలు వివక్ష చూపినప్పుడు.. ఫెడరల్ పౌర హక్కుల చట్టాలను ఉపయోగించవచ్చన్నారు. అంటే దీని అర్థం ఒక ఉద్యోగానికి అమెరికన్ అందుబాటులో ఉన్నప్పుడు కంపెనీలు విదేశీ కార్మికుడిని నియమించుకోవడాన్ని ఆటోమేటిక్‌గా నిషేధించినట్లు కాదు. హెచ్-1బీ ఉద్యోగికి స్పాన్సర్ చేయడానికి ముందు, అర్హత కలిగిన అమెరికన్ కార్మికుడు ఎవరూ లేరని నిరూపించాలని సాధారణంగా ఫెడరల్ చట్టం ఏ కంపెనీని కోరదు. బదులుగా నియామకాల సమయంలో కంపెనీలు చట్టవిరుద్ధమైన వివక్షకు పాల్పడ్డారా? లేదా? అనే దానిపై దృష్టి కేంద్రీకరించనున్నారు.
కెనడాలో విజిటర్ వీసాపై ‘నో జాబ్’
విజిటర్ వీసా లేదా ఎలకా్ట్రనిక్ ట్రావెల్ అథరైజేషన్ (ఈటీఏ) ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి కెనడాలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండదని, అందుకు వర్క్ పర్మిట్ అవసరమని కెనడా ఇమిగ్రేషన్ విభాగం ఐఆర్‌సీసీ స్పష్టం చేసింది. కెనడియన్ విజిటర్ వీసా అనేది వర్క్ పర్మిట్ కాబోదని తెలిపింది. కెనడాకు వచ్చే సందర్శకులు దేశం లోపలి నుంచి వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదని పేర్కొంది.