ట్రంప్‌తో గంటపాటు ఫోన్ కాల్! తప్పు చేయొద్దని నెతన్యాహు హెచ్చరిక
ABN , Publish Date - May 21 , 2026 | 10:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఇరాన్ విషయంలో గంట పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ట్రంప్ వ్యూహంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏకంగా గంటపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ఒక సంచలన కథనం ప్రచురితమైంది. ఇద్దరి మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ నిర్ణయాలు విన్న నెతన్యాహుకు తదుపరి ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మీడియా కథనాల ప్రకారం, ఇరాన్‌పై దాడులను మళ్లీ ప్రారంభించాలని నెతన్యాహు పట్టుబట్టారు. అయితే, ట్రంప్ మాత్రం దౌత్యపరమైన పరిష్కారంవైపు మొగ్గు చూపారు. ఈ నిర్ణయాన్ని నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చలతో పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. ఇరాన్ మిలిటరీ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీసేందుకు దాడులు మొదలుపెట్టాలని కోరారు. ఇరాన్ మౌలిక వసతులను కూడా దెబ్బతీసి పాలకవర్గాన్ని బలహీనపరచాలని సూచించారు.
అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చర్చలవైపే మొగ్గు చూపారు. దౌత్యపరమైన పరిష్కారం కోసం కొంత ప్రయత్నం జరగాలని స్పష్టం చేశారు. అప్పటికీ ఫలితం లేకపోతే యుద్ధానికి తాను సిద్ధమేనని కూడా చెప్పారు. యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇరాన్‌తో ముందుగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనపై ఖతర్, పాక్‌లు కృషిచేస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా ఇరాన్ అణుకార్యక్రమం, హోర్ముజ్‌పై కూలంకషంగా చర్చించేందుకు నెల రోజుల సమయం కూడా దక్కుతుందని చెప్పారు.
అయితే, ఈ వ్యూహం పనిచేయదని ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇరాన్‌పై దాడులను వాయిదా వేయడం ఘోర తప్పిదమవుతుందని హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్ తరువాత నెతన్యాహుకు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారని కూడా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతంలో చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.
ఈ విషయమై మరోసారి ట్రంప్‌తో చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని వచ్చే నెలలో అమెరికాకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ఫోన్‌కాల్‌పై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని అన్నారు. తాను ఏమి చెబితే నెతన్యాహు అదే చేస్తారని కూడా ముక్తాయించారు.
ఈ వార్తలనూ చదవండి:
యుద్ధం వేళ..ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్!
ఇరాన్‌తో యుద్ధంలో 42 విమానాలను నష్టపోయిన అమెరికా