Share News

చైనా శాటిలైట్‌తో యూఎస్ స్థావరాలపై ఇరాన్ నిఘా!

ABN , Publish Date - Apr 16 , 2026 | 08:02 AM

చైనా నుంచి తీసుకున్న శాటిలైట్‌తో ఇరాన్ యూఎస్ స్థావరాలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చైనా శాటిలైట్‌తో యూఎస్ స్థావరాలపై ఇరాన్ నిఘా!
Iran Using China Satellites

ఇంటర్నెట్ డెస్క్: చైనా సంస్థకు చెందిన శాటిలైట్ సాయంతో ఇరాన్ గల్ఫ్‌లోని యూఎస్ స్థావరాలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. గతేడాది చైనా సంస్థ ఎర్త్ ఐ కంపెనీకి చెందిన టీఈఈ-01బీ శాటిలైట్‌ను ఇరాన్ సైనిక దళం తీసుకున్నట్టు సమాచారం. ఇన్ ఆర్బిట్ మోడల్ విధానంలో ఎర్త్ ఐ కంపెనీ తన శాటిలైట్ సేవలను విక్రయిస్తుంటుంది. ఇందులో భాగంగా శాటిలైట్స్‌ను విజయవంతంగా ప్రయోగించి, ఆపై వాటిని విదేశీ బయ్యర్లకు బదిలీ చేస్తుంటుంది. ఈ డీల్‌లో భాగంగా వివిధ దేశాల్లోని గ్రౌండ్ బేస్డ్ స్టేషన్లనూ తమ అవసరాలకు వినియోగించుకునే అవకాశం కూడా ఇరాన్‌కు చిక్కింది. వీటి సాయంతో ఇరాన్ కమాండర్లు యూఎస్ స్థావరాలపై నిఘా పెట్టినట్టు సమాచారం.


మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ శాటిలైట్ సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ చిత్రాలను తీసినట్టు తెలుస్తోంది. ఇక్కడ నిలిపి ఉంచిన విమానాల్లో కొన్ని దాడుల్లో దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 14నే ప్రకటించారు. సౌదీతో పాటు బహ్రెయిన్‌లోని మరో స్థావరం, ఇరాక్‌లోని ఎర్బిల్ ఎయిర్‌పోర్టుపై కూడా ఇరాన్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాల్లోగల పౌర నిర్మాణాలపై కూడా నిఘా పెట్టేందుకు ఈ శాటిలైట్‌ను వినియోగించినట్టు వార్తలు వెలువడ్డాయి.


చైనా అధికార వర్గం నుంచి అనుమతులు లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ ఇరాన్ సైన్యంతో డీల్ కుదుర్చుకునే అవకాశాలు తక్కువని పాశ్చాత్య దేశాల నిఘా విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు చైనా మొదటి నుంచి సాయం చేస్తున్నప్పటికీ తన జోక్యం లేనట్టు చూపించుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న విషయం స్పష్టం అవుతోందని అన్నారు. ఇక చైనాతో పాటు రష్యాకు చెందిన శాటిలైట్‌లను కూడా ఇరాన్ వినియోగించుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

పోప్‌కు క్షమాపణ చెప్పను: ట్రంప్‌

ఒక యుద్ధం.. వంద నష్టాలు!

Updated Date - Apr 16 , 2026 | 08:29 AM