ఒక యుద్ధం.. వంద నష్టాలు!
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:54 AM
ఒక యుద్ధం.. వంద నష్టాలకు దారితీస్తోందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం..
దేశంలో 25లక్షల మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదం..ఆహార భద్రతకూ ముప్పు
వెల్లడించిన యూఎన్‌డీపీ నివేదిక
యునైటెడ్ నేషన్స్, ఏప్రిల్ 14: ఒక యుద్ధం.. వంద నష్టాలకు దారితీస్తోందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. భారత్‌లో 25లక్షల మందిని పేదరికం(బీపీఎల్)లోని నెట్టే ప్రమాదం ఉందని,మానవ పురోగతిపైనా యుద్ధం ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి విభాగం(యూఎన్‌డీపీ) తాజా నివేదిక వెల్లడించింది. యుద్ధం కారణంగా ఆసియా, పసిఫిక్ అంతటా మానవ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడనుందని తెలిపింది. ప్రధానంగా ఇంధన, రవాణా ఖర్చులు భారీగా పెరగడంతో అన్నిరకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయని పేర్కొంది. ఇది సాధారణ ప్రజల కొనుగోలు శక్తిని క్షీణించేలా చేస్తుందని నివేదిక తెలిపింది. ఆహార భద్రత సమస్యగా పరిణమించే అవకాశం ఉందని, ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరగనుందని వివరించింది. ప్రస్తుతం భారత దేశంలో 35.15కోట్ల మంది పేదరికంలో ఉండగా.. సంక్షోభం కారణంగా ఈ సంఖ్య 35.40కోట్లకు చేరుతుందని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం ఏర్పడిందని.. ఫలితంగా ఇంధనంతో పాటు ప్రాణాధార మందులపైనా ఈ ప్రభావం పడిందని నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో వైద్య పరికరాలు, మందుల ధరలు 50ు మేరకు పెరగనున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఔషధాల ధరలు 10-15ు పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజలపై యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించనుందని వివరించింది. యుద్ధంతో ఆసియా, పసిఫిక్ దేశాలు 299 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థికంగా నష్టపోతాయని యూఎన్‌డీపీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.