కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: ప్రధాని కార్నీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:58 PM
కెనడా నుంచి విడివడాలని ఆల్బర్టా ప్రావిన్సులో డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రధాని కార్నీ తాజాగా కీలక వ్యాఖ్యలు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడా నుంచి విడివడాలని ఆల్బర్టా ప్రావిన్సులో డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రధాని కార్నీ తాజాగా కీలక వ్యాఖ్యలు. కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆల్బర్టా ప్రావిన్స్ ప్రజలను హెచ్చరించారు. అమెరికాను ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ చేశారు. వేరుపడేందుకు అవసరమైన న్యాయప్రక్రియ ప్రారంభించాలా? వద్దా? అనే అంశంపై ప్రావిన్స్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రధాని కార్నీ ఆల్బర్టాలో పుట్టిపెరిగారు. పోలింగ్ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.
‘ఆల్బర్టా ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. అది నేను అర్థం చేసుకున్నాను. కానీ కెనడా నుంచి విడిపోయేందుకు అనుకూలంగా వేసే ఓటుతో మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏదో సందేశం పంపించామని భావించవద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఆ తరువాత వచ్చే ఎడాన్ని తగ్గించేందుకు, అనిశ్చితిని తొలగించేందుకు కొన్నేళ్ల పాటు కష్టపడాల్సి ఉంటుంది’ అని కార్నీ అన్నారు.
కెనడాలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న నాలుగో ప్రావిన్స్ ఆల్బర్టాలో ప్రజలు కేంద్రంపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు. వలసలు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు, చమురు రంగ నిర్వహణ సంబంధించి అంశాల్లో ఫెడరల్ గవర్న్మెంట్తో విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ఓటింగ్ ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఆల్బర్టా ప్రజల సమస్య పరిష్కారానికి కార్నీ కొంత ప్రయత్నిస్తున్నా చేయాల్సింది ఎంతో ఉందని అక్కడి రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ అంశాలపై గతంలో యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ అల్బార్టా అమెరికాకు సహజసిద్ధమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం పతాకస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఇక సహించేది లేదు.. రష్యా చమురు శుద్ధి కేంద్రంపై ఉక్రెయిన్ దాడి..
లండన్ వీధిలో స్పృహ కోల్పోయిన రాజకుటుంబ సభ్యురాలు.. కోర్టు చర్యలు.!