అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..
ABN , Publish Date - Sep 13 , 2026 | 08:04 AM
అమెరికాలోని శాక్రమెంటోలో భారత సంతతికి చెందిన 38 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. నెలల తరబడి ఆమెను వెంటాడిన ఓ యువకుడు తుపాకీతో కాల్పి చంపాడు.
కాలిఫోర్నియా: అమెరికాలోని శాక్రమెంటోలో భారత సంతతికి చెందిన 38 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. నెలల తరబడి ఆమెను వెంటాడిన ఓ యువకుడు తుపాకీతో కాల్పి చంపాడు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) నిందితుడిని భారతీయ యువకుడు రోహిత్(22)గా గుర్తించింది. మహిళను హత్య చేసిన అనంతరం పోలీసులు వెంబడించగా రోహిత్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సెప్టెంబర్ 8న శాక్రమెంటోలోని ఓ షాపింగ్ సెంటర్‌లోని రెస్టారెంట్ వెలుపల చోటుచేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉన్న శాలిని ఠాకూర్ వద్దకు రోహిత్ వెళ్లాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వెంటాడి మరీ తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో శాలిని కుప్పకూలగా ఆమె తలపై మరోసారి కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి తన కారులో రోహిత్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతడి వాహనాన్ని ఈస్ట్‌బౌండ్ హైవే 50పై వాట్ అవెన్యూ సమీపంలో గుర్తించారు. నిందితుడి వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించడంతో అతడు హైవేపైనే కారును నిలిపివేశాడు. దీంతో అక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు, నిందితుడి మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు రోహిత్ కారులో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రోహిత్ గత కొన్ని నెలలుగా శాలినిని వెంటాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమెరికాలో నిందితుడు అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాలిని కారు టైర్లలో గాలి తీసేయడం, పని ప్రదేశం వరకు వెంబడించడం వంటి చర్యలకు రోహిత్ పాల్పడినట్లు ఆరోపించారు. అంతేకాకుండా శాలిని నివాసానికి చెందిన నకిలీ తాళం తయారు చేసి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. అతని చర్యలను తట్టుకోలేక బాధితురాలు.. గత మే నెలలో కోర్టును ఆశ్రయించినట్లు దర్యాప్తులో తేలింది. శాలిని విషయంలో నిందితుడు ఆకర్షణకు గురి కావడమే దారుణానికి కారణంగా తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
జకీర్ నాయక్ అప్పగింతపై చర్చించాం
పశ్చిమాసియాలో శాంతి మన బాధ్యత