ట్రంప్ తనయుడితో స్నేహం! అసూయతో యువతిపై దాడి చేసిన వ్యక్తికి జైలుశిక్ష
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:22 PM
ట్రంప్ తనయుడు బారెన్ ట్రంప్‌తో స్నేహం చేసిన యువతిపై అసూయతో దాడి చేసిన ఓ వ్యక్తిపై యూకే కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దాడి జరుగుతున్న వైనాన్ని వీడియో కాల్‌లో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బారెన్ ట్రంప్‌ను న్యాయమూర్తి ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్‌తో స్నేహం చేస్తున్న యువతిపై అసూయతో దాడి చేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు యూకేలో తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది అమెరికాలో ఉన్న బారెన్ ట్రంప్ యూకేలోని యువతితో వీడియో కాల్‌లో ఉండగా ఈ దాడి జరిగింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన బారెన్ యూకే పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రష్యా యువకుడు రూమియాంత్సేవ్‌కు నార్త్‌ఈస్ట్ లండన్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష వేసింది. బారెన్ ట్రంప్ ఫోన్ కాల్ వల్లే ఆమె ప్రాణాలు నిలిచాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు డాక్యుమెంట్స్‌లోని వివరాల ప్రకారం, తొలుత బారెన్ ట్రంప్ యువతిపై దాడిని చూడగానే యూకే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మీకు యువతి ఎలా తెలుసని ఆపరేటర్ ప్రశ్నించగా అవన్నీ అప్రస్తుతమని బారెన్ సమాధానం ఇచ్చారు.
దీంతో, బారెన్ వైఖరిపై టెలిఫోన్ ఆపరేటర్ అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఆమె తనకు సోషల్ మీడియాలో పరిచయమైందని బారెన్ తెలిపారు. ‘బారెన్ ట్రంప్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ యూకేలోని ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు కాల్ చేశారు. తాను చూసింది చెప్పారు’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు.
ఇక యువతిపై దాడికి పాల్పడ్డ రష్యా వ్యక్తిలో పశ్చాత్తాపం కనిపించలేదని కూడా న్యాయమూర్తి మండిపడ్డారు. నిందితుడు అసూయను అధిగమించలేకపోయాడని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు తప్పదని యువతి ఒకానొక దశలో భయపడిందని కూడా న్యాయమూర్తి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
'సుప్రీం లీడర్ ఇక లేరు'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ జలసంధి.. కాదు హోర్ముజ్.. యూఎస్ అధ్యక్షుడి కామెంట్స్