ప్రధాని మోదీ వల్లే భారత్‌కు ఇంధన భద్రత: ఆస్ట్రేలియా ప్రధాని
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:05 PM
అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంలో క్రెడిట్ అంతా ప్రధాని మోదీదేనని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంలో క్రెడిట్ అంతా ప్రధాని మోదీదేనని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ప్రశంసించారు. ఇతర దేశాలేవీ ఇంతటి బృహత్ కార్యాన్ని నిర్వహించలేదని అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో సెప్టెంబర్ 24న ఏషియా పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రధాని మోదీ హయాంలో గత దశాబ్దంలో పెద్ద సంఖ్యలో భారతీయులకు ఇంధన భద్రత లభించింది. మానవ చరిత్రలో మరే దేశంలోనూ ప్రాంతంలోనూ ఇలాంటిది జరగలేదు’ అని ఆయన అన్నారు. హోర్ముజ్ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇంధన భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడంతో ఇంధన భద్రత పెరిగిందని అన్నారు. ప్రస్తుతం ముడిచమురు, ఎల్‌పీజీ, పీఎన్‌జీని భారత్ 41దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. గతంలో భారత్ కేవలం 27 దేశాల నుంచే ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదని అన్నారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, బంగ్లాదేశ్, వంటి దేశాల్లో ఇంధన కొరత నెలకొంది. అయితే, భారత్‌లో మాత్రం ఇంధన భద్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్ మూతపడడంతో ఇరాన్‌కు ఆర్థిక ఇబ్బందులు : డొనాల్డ్ ట్రంప్
డీల్ లేదని తేల్చేసిన ట్రంప్.. ఇరాన్ ఆచితూచి స్పందన