యూఎస్ఏలో భారతీయ యువతి హత్య! ఇరాన్ కుట్ర కోణంపై అనుమానాలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 08:04 PM
ఆస్టిన్‌లో ఇటీవల జరిగిన కాల్పుల్లో ఇరాన్ ఉగ్ర కోణం ఉండే అవకాశం ఉందని టెక్సాస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో భారతీయ యువతి కూడా మరణించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్టిన్‌లో (టెక్సాస్) ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ యువతి సహా ముగ్గురు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ కాల్పుల ఘటన వెనుక ఇరాన్ ఉగ్ర కుట్ర ఉందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వెస్ట్ సిక్స్త్ వీధిలో బ్యూఫోర్డ్ బార్న్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు దిగడంతో ముగ్గురు మరణించగా 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక నిందితుడు కూడా పోలీసులు కాల్పుల్లో మరణించాడు. దీంతో, మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
కాల్పులకు బలైన భారతీయ యువతిని సవిత షన్ముఖసుందరంగా పోలీసులు గుర్తించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చదువుకునే వారు. మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎకనమిక్స్‌లో డ్యూయెల్ డిగ్రీతో ఆమె చదువు మే నెలలో పూర్తి కావాల్సి ఉంది. ఇంతలోనే ఆమె కన్నుమూశారు.
సవిత మృతిపై యూనివర్సిటీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తమ యూనివర్సిటీలోని సూపర్ స్టార్ స్టూడెంట్స్‌లో ఆమె కూడా ఒకరని అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. చదువు పూర్తయ్యాక ఆమె ఒక ప్రముఖ సంస్థలో చేరాల్సి ఉండగా ఈ ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
స్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు