ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు
ABN , Publish Date - Aug 05 , 2026 | 08:31 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ కోర్స్ వద్ద తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ కోర్స్ వద్ద తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడిని తొలుత సీక్రెటస్ ఫెడరల్ ఏజెంట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియాలో ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్ రానున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
నిందితుడిని జెనైన్ జాన్ టీల్ (38)గా పోలీసులు గుర్తించారు. అతడి ప్యాంటు జేబుల్లో తుపాకీ, మేగజైన్‌ను గుర్తించారు. రెండిట్లోనూ తుటాలు నింపి ఉన్నట్టు తెలిపారు. నిందితుడు డౌనీకి చెందిన వాడని చెప్పారు. గోల్ఫ్ క్లబ్ పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన అతడి కారులో పోలీసులు మరిన్ని తూటాలను కూడా కనుగొన్నారు. గతంలో అతడిపై దోపిడీ కేసు కూడా ఉన్నట్టు చెప్పారు. సీక్రెట్‌గా ఆయుధాలు వెంట తెచ్చుకున్నాడన్న అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఆదివారం అతడిని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం డౌనీలోని అతడి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత మోడిఫికేషన్స్ చేసిన ఏఆర్-ప్లాట్‌ఫామ్ పిస్టల్, .45 క్యాలిబర్ పిస్టల్, రెండు రేడియో డివైజులు, పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాల్లోని విషయాలు కొంత ఆందోళనకరంగా ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు. అయితే, అతడితో ప్రస్తుతానికి స్థానికులకు ఎలాంటి ముప్పు లేదని కూడా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి
ట్రంప్ కొత్త సుంకాలపై 25 రాష్ట్రాల కేసు!