అమెరికాలో దారుణం.. భారత సంతతికి చెందిన మహిళ హత్య..
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:18 AM
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన మహిళ భర్త చేతిలో హత్యకు గురైంది. భర్త ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన మహిళ భర్త చేతిలో హత్యకు గురైంది. భర్త ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భారత సంతతికి చెందిన 57 ఏళ్ల శీతల్ వృజీషియన్ గూగుల్ కంపెనీలో టెక్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. ఆమె తన భర్త కిర్క్ బీ వృజీషియన్, కుమారుడు జేసన్ వృజీషియన్, కూతురు జెస్సికాతో కలిసి జార్జియాలోని స్మిర్నా సిటీలో నివాసం ఉంటోంది. గత కొంతకాలం నుంచి శీతల్, కిర్క్ మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా కిర్క్ దారుణానికి ఒడిగట్టాడు. భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. శీతల్ అక్కడికక్కడే చనిపోగా.. జేసన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కిర్క్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ జేసన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. శీతల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో స్థానిక జనం భయాందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. శీతల్ హత్య గృహ హింస కారణంగా చోటుచేసుకుందని, ప్రజలకు దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, శీతల్‌కు సాంకేతిక రంగంలో 20 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉంది. ఆమె గూగుల్‌లో చేరడానికి ముందు 'హోమ్ డిపో' డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంగ్లండ్, ఇండియా, ఘనా దేశాలలో పెరిగిన ఆమె.. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివారు.
ఇవి చదవండి
వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా..