అమెరికాలో దారుణం.. 16 మంది చిన్నారులను బంధించిన కుటుంబ సభ్యులు..
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:39 AM
అగ్రరాజ్యం అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 16 మంది చిన్నారులను ఏళ్ల తరబడి ఓ పాడుబడిన ఇంట్లో బంధించి ఉంచిన విషయం తాజాగా బయటపడింది.
అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 16 మంది చిన్నారులను ఏళ్ల తరబడి ఓ పాడుబడిన ఇంట్లో బంధించి ఉంచిన విషయం తాజాగా బయటపడింది. మరో కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆ ఇంటికి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను వెంటనే రక్షించిన పోలీసులు, వారిని బంధించిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఒహాయో రాష్ట్రంలోని హామ్డెన్‌లో రైల్వే ట్రాక్ పక్కన దట్టమైన చెట్లు, పొదల మధ్య ఉన్న ఓ ఇంటికి పోలీసులు సెర్చ్ వారెంట్‌తో వెళ్లారు. అక్కడ 16 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలు బంధించి ఉంచినట్లు గుర్తించారు. గత నాలుగేళ్లుగా వారు అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. బాధిత చిన్నారులను 12 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు గల ఒకే గదిలో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారుల వయస్సు 18 నెలల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండగా, వారిలో బాలురు, బాలికలు ఉన్నారు. అంతేకాక, ఆ ఇంట్లో ఇంతమంది చిన్నారులు ఉన్న విషయం చుట్టుపక్కల వారికి కూడా తెలియకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చిన్నారులకు బయటి ప్రపంచంతో దాదాపు ఎలాంటి సంబంధం లేకుండా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఎవరినీ ఇప్పటివరకు తల్లిదండ్రులు పాఠశాలకు పంపలేదు. చాలా కాలం పాటు బంధించబడటంతో వారు సాధారణంగా మాట్లాడటానికే ఇబ్బంది పడుతున్నట్లు ఒహాయో అటార్నీ జనరల్ తెలిపారు. దాదాపు అందరూ అడవి మనుషుల్లా కనిపించారని ఆయన పేర్కొన్నారు. ఈ 16 మంది చిన్నారులూ ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు వెల్లడించారు. రక్షించిన వెంటనే ఏడుగురు చిన్నారులను చికిత్స కోసం కొలంబస్‌లోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌లో అత్యవసర చికిత్స కోసం తరలించాల్సి వచ్చింది.
ఈ ఘటనలో పిల్లల తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలైన గ్యారీ సైడర్స్ జూనియర్, గ్యారీ సైడర్స్ సీనియర్, క్రిస్టినా సైడర్స్, ఎలిజబెత్ సైడర్స్‌లపై సెకండ్-డిగ్రీ ఫెలనీ 'చైల్డ్ ఎండేంజర్‌మెంట్' అభియోగాలు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ప్రతి నిందితుడికి 3 లక్షల డాలర్ల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయాలని కోర్టు నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి
నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్