యుద్ధ నౌకల కోసం ట్రంప్ అభ్యర్థన.. తిరస్కరించిన మిత్ర దేశాలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:35 AM
హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు యుద్ధ నౌకలను పంపించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థనపై మిత్ర దేశాలు ఆచితూచి స్పందించాయి. ప్రస్తుతం తమకు ఆ ఉద్దేశం లేదని పలు దేశాలు స్పష్టం చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు యుద్ధ నౌకలను పంపాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్థనను మిత్ర దేశాలు తిరస్కరించాయి. ప్రస్తుతానికి తమకు ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పాయి. ట్రంప్ అభ్యర్థనను ఆస్ట్రేలియా తోసి పుచ్చింది. తాము యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేసింది. ‘ఆ జలసంధి ఎంత కీలకమో మాకు తెలుసు. కానీ అక్కడకు మేము యుద్ధ నౌకలను పంపబోము. అసలు యుద్ధ నౌకల కోసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు’ అని ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ చెప్పారు.
ట్రంప్ అభ్యర్థనపై జపాన్ ఆచితూచి స్పందించింది. ఈ విషయంలో సంయమనం అవసరమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము మేరిటైమ్ చర్యల గురించి ఆలోచించట్లేదని పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు తెలిపింది.
అమెరికాతో మరిన్ని చర్చల తరువాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని దక్షిణ కొరియా పేర్కొంది. సమగ్ర సమీక్ష తరువాత ఈ విషయంలో ముందడుగు వేస్తామని వెల్లడించింది.
బ్రిటన్ కూడా ఈ విషయమై ఆచితూచి స్పందించింది. యుద్ధ నౌకలను పంపించే విషయంలో ట్రంప్‌తో చర్చిస్తున్నామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కూడా చర్చించినట్టు తెలిపారు. సోమవారం జరగనున్న సమావేశంలో మరోసారి ఈ విషయమై చర్చిస్తామని అన్నారు.
హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు యుద్ధ నౌకలను పంపించాలని పలు దేశాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అభ్యర్థించిన విషయం తెలిసిందే. తమ పరిధిలోని ప్రాంతాన్ని ఆయా దేశాలు రక్షించుకోవాలని అన్నారు. ఇంధన అవసరాల కోసం హోర్ముజ్ జలసంధిపై అమెరికా అంతగా ఆధారపడలేదని అన్నారు. ఇతర దేశాలకే ఆ అవసరం ఎక్కువని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా చైనా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా దిగుమతుల్లో అధిక శాతం హోర్ముజ్ మీదుగానే వెళుతున్నాయని అన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధిని తెరిపించే ప్రయత్నాల్లో చైనా భాగం అవుతుందా? లేదా? అనే విషయంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
ఇరాన్ దాడులు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు బ్రేక్
ఇదిగో.. నాకు ఐదు వేళ్లే ఉన్నాయ్! నెతన్యాహు కొత్త వీడియో