Share News

ముస్లిం సెనెటర్ తొలి ప్రసంగం.. వాన్స్‌, ట్రంప్‌పై పంచ్‌లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:31 PM

సెనెట్ ఎన్నికల్లో మిచిగన్ రాష్ట్రం నుంచి విజయం సాధించిన డెమోక్రటిక్ నేత అబ్దుల్ ఎల్ సయీద్ తన విజయోత్సవ ప్రసంగంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్‌కు చురకలు అంటించారు.

ముస్లిం సెనెటర్ తొలి ప్రసంగం.. వాన్స్‌, ట్రంప్‌పై పంచ్‌లు
Abdul El Sayed

ఇంటర్నెట్ డెస్క్: సెనెట్ ఎన్నికల్లో మిచిగన్ రాష్ట్రం నుంచి విజయం సాధించిన డెమోక్రటిక్ నేత అబ్దుల్ ఎల్ సయీద్ తన విజయోత్సవ ప్రసంగంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్‌కు చురకలు అంటించారు. ఎన్నికల సందర్భంగా వారు చేసిన విమర్శలనే అస్త్రాలుగా మార్చుకుని సెటైర్లు పేల్చారు. అమెరికాలో తొలి ముస్లిం సెనెటర్‌గా అబ్దుల్ ఎల్ సయీద్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.


ఈ సందర్భంగా ప్రసంగించిన అబ్దుల్ నేరుగా వాన్స్‌పై పంచ్‌లు వేశారు. జేడీని హబీబీ అని సంభోదించారు. కేవలం ముస్లిం అయినందుకు తనను టార్గెట్ చేసినందుకు వారికి దీటుగా జవాబిచ్చారు. ‘జేడీ.. హబీబీ.. మీరే నాతో ప్రమాణస్వీకారం చేయించాలి. రాజ్యంగ పరంగా అది మీ బాధ్యత’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌ను కూడా వదిలిపెట్టలేదు. ‘మీకు నా పేరు పలకడం కష్టం కదా. కాబట్టి, జేడీ నాతో ప్రమాణ స్వీకారం చేయించాక మీరు నన్ను సెనెటర్ అని పిలవచ్చు. అప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు’ అంటూ ట్రంప్‌నకు చురకలు అంటించారు.


ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రాజర్స్‌పై రెండు లక్షల ఓట్ల మెజారిటీతో అబ్దుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో, మిచిగన్ సెనెట్ సీటు కూడా డెమోక్రాట్ల పార్టీ పరమైంది. ఇక ప్రచారం సందర్భంగా ట్రంప్, ఆయన మద్దతుదారులు అబ్దుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అబ్దుల్ జీహాదీ అని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అబ్దుల్ పేరు పలకడంలో కూడా ట్రంప్ పలుమార్లు తడబడ్డారు. అబ్దుల్‌కు అతివాద ముస్లిం బ్రదర్‌హుడ్‌తో సంబంధం ఉందని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ టెడ్ క్రజ్ ఆరోపించారు. అయితే, అబ్దుల్ ఎల్ సయీద్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పనే ప్రధాన ఎజెండగానే ప్రచారం కొనసాగించి విజయం సాధించారు.


ఈ వార్తలనూ చదవండి:

మిడ్‌టర్మ్ ఎన్నికల సర్‌ప్రైజ్.. యూఎస్‌లో తొలి ముస్లిం సెనెటర్

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు

Updated Date - Nov 04 , 2026 | 04:58 PM