భారత్‌తో ఒప్పందం కుదరకపోవడానికి వాన్స్, నవారో కారణం: సెనెటర్ టెడ్ క్రజ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:09 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానంపై సొంత పార్టీలోనే విభేదాలు పెరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక సెనెటర్ అధ్యక్షుడి తీరును విమర్శించిన ఆడియో ఒకటి లీకై అమెరికాలో కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న సుంకాల విధింపు విధానంపై అధికార రిపబ్లికన్ పార్టీలో అభిప్రాయభేదాలు తీవ్రమయ్యాయి. టారిఫ్‌లే కేంద్రంగా సాగుతున్న అమెరికా వాణిజ్య విధానంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నేత, సెనెటర్ టెడ్ క్రజ్ విమర్శలు గుప్పించిన ఆడియో లీక్ కావడంతో ప్రస్తుతం కలకలం రేపుతోంది (Ted Cruz Criticism of Donald Trump Tariff Policy).
భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు పీటర్ నవారో అడ్డుకుంటున్నారని టెడ్ క్రజ్ ఆరోపించినట్టు ఓ ఆడియోను స్థానిక మీడియా సంస్థ విడుదల చేసింది. గతేడాది రిపబ్లికన్ పార్టీ దాతలతో జరిగిన సమావేశం సందర్భంగా టెడ్ క్రజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపింది. తాను స్వేచ్ఛా వాణిజ్యానికి మొగ్గు చూపుతానని, కానీ ట్రంప్ మంత్రి వర్గంలోని కొందరు మాత్రం ఇందుకు సుముఖంగా లేరని టెడ్ క్రజ్ చెప్పారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి కొన్ని సార్లు ట్రంప్ స్వయంగా మోకాలడ్డారని కూడా అన్నారు.
ట్రంప్ వాణిజ్య విధానంతో అమెరికా ఆర్థిక రంగం కుప్పకూలుతుందని కూడా టెడ్ క్రజ్ హెచ్చరించారు. చివరకు అమెరికా అధ్యక్షుడికి అభిశంసన ముప్పు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది ట్రంప్ సుంకాలను విధించిన సమయంలోనే తాను, కొద్ది మంది ఇతర సెనెటర్లు అధ్యక్షుడికి ఫోన్ చేసి వారించినట్టు చెప్పారు. అయితే, ట్రంప్ మాత్రం అసహనంతో తమపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. వచ్చే ఏడాది (2026) నవంబర్ నాటికి ప్రజల పెన్షన్ ఆదాయం తగ్గినా, వస్తుసేవల ధరలు10-20 శాతం మేర పెరిగినా ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా హెచ్చరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ తనపై మరింత అసహనం వ్యక్తం చేశారని అన్నారు.
భారత్‌తో ట్రేడ్ డీల్‌కు రెడీ కావాలని తాను శ్వేతసౌధంతో పోరాడానని కూడా టెడ్ క్రజ్ చెప్పుకొచ్చారు. ఈ డీల్‌ను ఎవరు వ్యతిరేకిస్తున్నారని కొందరు దాతలు ప్రశ్నించగా.. పీటర్ నవారో, వాన్స్, కొన్ని సార్లు ట్రంప్ మోకాలడ్డారని క్రజ్ తెలిపినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇవీ చదవండి:
చైనాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండదు.. స్పష్టం చేసిన కెనడా ప్రధాని
భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?