Share News

చైనాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండదు.. స్పష్టం చేసిన కెనడా ప్రధాని

ABN , Publish Date - Jan 26 , 2026 | 09:15 AM

చైనాతో ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉండదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. హద్దుల్లేని దిగుమతులకు తాము ద్వారాలు తెరవట్లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

చైనాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండదు.. స్పష్టం చేసిన కెనడా ప్రధాని
g, Canada China trade deal denied

ఇంటర్నెట్ డెస్క్: చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తానన్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీలక కామెంట్స్ చేశారు. చైనాతో ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ఆలోచన తమకు లేదని ఆదివారం స్పష్టం చేశారు. చైనాకు కెనడా దగ్గరవుతోందన్న ట్రంప్ ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. కొన్ని ప్రత్యేక సుంకాల అడ్డంకులను తొలగించేందుకు ఇటీవల చైనాతో చర్చలు చేపట్టామని వివరణ ఇచ్చారు (No FTA with China Says Canada PM).

‘సీయూఎస్ఏమ్ఏ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాము. అమెరికా, మెక్సికోతో కూదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, ఆ రెండు దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇతర దేశాలతో ట్రేడ్ డీల్స్ సాధ్యం కాదు. కాబట్టి, మాకు చైనా సహా ఇతర ఏ దేశంతోనూ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ఉద్దేశం లేదు’ అని కార్నీ స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే, కెనడాపై తొలుత బెదిరింపులకు దిగిన డొనాల్డ్ ట్రంప్ ఆ తరువాత కాస్త మెత్తబడ్డట్టు కనిపించారు. తాజాగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టుల్లో కేవలం చైనాను మాత్రమే టార్గెట్ చేశారు. ‘గొప్ప దేశమైన కెనడాను చైనా విజయవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాళ్లు, కనీసం ఐస్ హాకీనైనా వదిలిపెడితే బాగుండును’ అని అన్నారు. చైనాతో డీల్స్ విపత్కరమని కూడా కెనడాను మరోసారి హెచ్చరించారు. కెనడా సుభిక్షంగా ఉండాలనేదే తన అభిమతమని చెప్పుకొచ్చారు.

2024లో అమెరికాను అనుసరిస్తూ కెనడా ప్రభుత్వం చైనా కంపెనీల విద్యుత్ వాహనాలు, స్టీల్ ఉత్పత్తులపై వరుసగా 100 శాతం, 25 శాతం సుంకం విధించింది. ఇందుకు ప్రతిగా చైనా కూడా కెనడా నుంచి దిగుమతయ్యే వాటిపై సుంకాలను పెంచింది. అయితే, ఇటీవల చైనా పర్యటన సందర్భంగా కెనడా ప్రధాని చైనా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించారు. చైనా కూడా కెనడా వ్యవసాయ దిగుమతులపై సుంకాలను తగ్గించింది. వాణిజ్యాన్ని స్థిరీకరించేందుకే సుంకాలను తగ్గించామని ప్రధాని కార్నీ అప్పట్లో పేర్కొన్నారు. అవధుల్లేని దిగుమతులకు తాము ద్వారాలు తెరవలేదని కూడా స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్! ఇక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదే..

అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో పౌరుడి మృతి.. షాకింగ్ వీడియో

Updated Date - Jan 26 , 2026 | 09:24 AM