అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:43 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు పుట్టుకతోనే దేశ పౌరసత్వాన్ని కల్పించే రాజ్యాంగ హక్కును పరిమితం చేస్తూ...
అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకు పౌరసత్వం
అది రాజ్యాంగ హక్కు.. సహజంగానే లభిస్తుంది
ఆ హక్కును అధ్యక్షుడి కార్యనిర్వాహక
ఉత్తర్వులతో మార్చడం కుదరదు
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు.. ట్రంప్‌కు షాక్
‘పుట్టుకతోనే పౌరసత్వం’ అంశంలో ట్రంప్ సర్కార్ విధించిన పరిమితుల కొట్టివేత
వాషింగ్టన్, జూన్ 30: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు పుట్టుకతోనే దేశ పౌరసత్వాన్ని కల్పించే రాజ్యాంగ హక్కును పరిమితం చేస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. 6-3 మెజారిటీతో వెలువడిన ఈ తీర్పులో.. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికాలో పుట్టిన దాదాపు ప్రతీ శిశువుకు అమెరికా పౌరసత్వం సహజంగా లభిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించే హక్కును అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చలేమని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు విదేశీయులైనా.. అమెరికాలో పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందని, ఆ పిల్లలు వారు పుట్టిన రాష్ట్రానికి చెందిన వారవుతారని రాజ్యాంగంలోని 14వ సవరణ చెబుతోంది. విదేశీ దౌత్య అధికారులు, శత్రు దేశాల సైనికుల పిల్లలకు మాత్రం పౌరసత్వం లభించదు. 1868నుంచి ఇది అమల్లో ఉంది. అయితే, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఈ 14వ సవరణను తీవ్రంగా తప్పుబట్టారు. 14వ సవరణ ప్రపంచంలోనే చెత్త ఇమ్మిగ్రేషన్ విధానమని జేడీ వాన్స్ కూడా విమర్శించారు. ఈ మేరకు పుట్టుకతోనే పౌరసత్వం లభించే అంశంలో సవరణ చేస్తూ ట్రంప్ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. విషయం న్యాయస్థానానికి చేరగా.. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలతో అమెరికాలో ఉంటున్న వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం తగదని ట్రంప్ సర్కారు వాదించింది. కానీ సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!