ఇరాన్ డ్రోన్లు కూల్చివేత.. రాడార్ సైట్లపై బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న యుద్ధ జ్వాలలు!
ABN , Publish Date - Jun 06 , 2026 | 08:10 AM
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరు దేశాల మధ్య జరిగిన తాజా సైనిక చర్యలు పశ్చిమాసియాలో ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రమాదంలో పడేశాయి.
వాషింగ్టన్/టెహ్రాన్, జూన్ 6: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ ముసురుతున్నాయి. హోర్ముజ్ జలసంధి లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ తీరప్రాంతంలోని నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ డ్రోన్ల వల్ల తక్షణ ముప్పు పొంచి ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పష్టం చేసింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే జలసంధిలోని ఒక ద్వీపంతో పాటు ఇరాన్ తీరంలోని కీలక రాడార్ సైట్‌లపై తాము దాడులు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
మరోవైపు, ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటి హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండగా, అందుకు ప్రతిగా అమెరికా ఇరాన్ రేవులపై ఆంక్షలు, దిగ్బంధనాన్ని విధిస్తోంది. ఈ వారంలోనే కువైట్ ప్రధాన విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్‌పై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడ్డారు. దీనివల్ల ఎయిర్‌ఫీల్డ్ తాత్కాలికంగా మూతపడింది. ఈ దాడితో తీవ్ర ఆగ్రహానికి గురైన అమెరికా, తాజా ఘర్షణతో ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు పంపింది.
రాడార్ సైట్‌లపై దాడులతో పాటు, హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ లింక్డ్ చమురు ట్యాంకర్‌ను అమెరికా సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆంక్షల పరిధిలో ఉన్న చమురును విక్రయించడం ద్వారా ఇరాన్ లాభపడకుండా అడ్డుకునేందుకు అమెరికా ఈ చర్య చేపట్టింది. అలాగే, ఇరాన్ ఇంధన రంగానికి సహాయం చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలు, ట్యాంకర్లపై అమెరికా కొత్తగా మరికొన్ని ఆర్థిక ఆంక్షలను విధించింది.
లెబనాన్ సరిహద్దుల్లోనూ రాజుకున్న మంటలు
ఇరాన్-అమెరికా ఘర్షణ కేవలం జలసంధికే పరిమితం కాలేదు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ తిరస్కరించింది. ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లోని ఎక్కువ భాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు, హోర్ముజ్ జలసంధి తెరవాలన్నా, శాశ్వత కాల్పుల విరమణ కుదరాలన్నా లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగాలని ఇరాన్ పట్టుబడుతోంది.