యుద్ధం మళ్లీ మొదలు?
ABN , Publish Date - May 27 , 2026 | 04:11 AM
పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలైంది. శాంతి ఒప్పందం కుదిరి, పరిస్థితులు చక్కబడతాయన్న ఆశలు నెలకొన్న సమయంలో పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని....
ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన అమెరికా.. బందర్ అబ్బాస్ పోర్టు, ఇతర ప్రాంతాల్లో బాంబులు
ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు: అమెరికా క్షిపణి నిల్వ, ప్రయోగ కేంద్రాలు,
సీమైన్స్ పెట్టే బోట్లు ధ్వంసం చేశామని వెల్లడి
ప్రతిదాడులకు దిగుతున్నట్టు ఐఆర్‌జీసీ ప్రకటన
అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ కూల్చివేత!
పశ్చిమాసియాలో స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరిక
అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదు: మొజ్తాబా ఖమేనీ
ఒమన్ తీరంలో చమురు నౌకలో పేలుళ్లు
ఖతార్ వేదికగా ఇరాన్-అమెరికా పరోక్ష చర్చలు
మళ్లీ చమురు ధరలు పైకి.. స్టాక్ మార్కెట్లు డౌన్
యురేనియం ఇస్తారా.. నాశనం చేస్తారా: ట్రంప్
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మే 26: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలైంది. శాంతి ఒప్పందం కుదిరి, పరిస్థితులు చక్కబడతాయన్న ఆశలు నెలకొన్న సమయంలో పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని క్షిపణుల నిల్వ, ప్రయోగ కేంద్రాలు, తీర ప్రాంతం వెంట మోహరించి ఉన్న ‘సముద్రపు మందుపాతరలు (సీమైన్స్)’ పెట్టే నౌకలు, బోట్లు లక్ష్యంగా విమానాలతో బాంబులు కురిపించాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆత్మరక్షణ కోసం, ఇరాన్ దళాల నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షించుకునేందుకు ఈ దాడులు చేపట్టామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కాల్పుల విరమణ కొనసాగుతున్నా తమకు ముప్పు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడితే దాడులు చేస్తామని సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ రేవు పట్టణం బందర్ అబ్బా్‌సపై దాడులు చేశామని తెలిపారు. మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. తమ గగనతలం వైపు వస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లపై కాల్పులు జరిపామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్(ఐఆర్‌జీసీ) మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఖరీదైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేశామని, ఎఫ్-35 ఫైటర్, ఆర్‌క్యూ-4 డ్రోన్‌పైనా కాల్పులు జరిపామని తెలిపింది. అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడితే.. అందుకు దీటుగా ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని పేర్కొంది. అమెరికా సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే.. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, బలగాలపై ఊహించని రీతిలో దాడులకు దిగుతామని హెచ్చరించింది. శాంతి ఒప్పందంవైపు అడుగులు పడుతున్నాయన్న ప్రచారంతో కాస్త తగ్గిన చమురు ధరలకు.. ఇరాన్‌పై అమెరికా దాడులతో మళ్లీ రెక్కలు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజే ఐదు శాతం మేర ధరలు పెరిగాయి. యుద్ధ భయాలతో భారత్ సహా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.
ఖతార్‌లో పరోక్ష చర్చలు
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి కోసం ఖతార్ మధ్యవర్తిత్వంతో ఆ దేశ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ పరోక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ తరఫున చర్చలకు నేతృత్వం వహిస్తున్న పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఘలీబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ జస్సిమ్ అల్ థానీ చర్చలు జరుపుతున్నారు. ఆ వివరాలను అమెరికా ప్రతినిధులకు వివరిస్తూ.. వారి డిమాండ్లు, సూచనలను ఇరాన్ ప్రతినిధులకు చేరవేస్తున్నారు. ఈ చర్చలకు సంబంధించిన ముసాయిదాపై ఇప్పటికే ఇరువైపులా సానుకూలత వచ్చిందని, దాని ప్రకారం మరో 60 రోజులు కాల్పుల విరమణ పొడిగింపు, హోర్ముజ్ తెరవడం వంటి అంశాలు ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ఇంతకుముందే వెల్లడించారు. ఇరాన్ అణుకార్యక్రమంపై చర్యలు తర్వాతి దశలో ఉంటాయని చెప్పారు.
అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదు
అమెరికా మళ్లీ దాడులు చేపట్టడంపై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీన్ని ఏమాత్రం సహించబోమని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పేరిట రాతపూర్వకంగా విడుదలైన ప్రకటనను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా పట్టు సడలిపోయినట్టేనని, ఇకపై వారి స్థావరాలకు ఏ మాత్రం రక్షణ ఉండదని మొజ్తాబా ఖమేనీ అందులో హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం హోర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంలో ఒక చమురు ట్యాంకర్ నౌకలో పేలుళ్లు జరిగాయి. గుర్తుతెలియని వస్తువు ఢీకొనడంతో నౌక వెనుక భాగంలో పేలుళ్లు జరిగాయని, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని ఆ ప్రాంతంలో నౌకా రవాణాను పర్యవేక్షించే యూకే మారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది. నౌక నుంచి చమురు లీకవుతున్నట్టు గుర్తించామని తెలిపింది. అయితే ఈ దాడికి కారణమేమిటన్నది తెలియరాలేదని పేర్కొంది.
యురేనియం అప్పగిస్తారా.. నాశనం చేస్తారా: ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చల్లో.. ఇరాన్ అణు కార్యక్రమం వదులుకోవడం, శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించడంపై పీటముడి పడిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తాజాగా మరో అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని నిర్వీర్యం చేయడం కోసం వెంటనే అమెరికాకు అప్పగించాలి. లేదా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లేదా దాని సమాన స్థాయి సంస్థ ఇరాన్‌తో సమన్వయం చేసుకుని ఒక ఆమోద యోగ్యమైన ప్రదేశంలో ఆ యురేనియాన్ని నాశనం చేయాలి’’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఇరాన్‌తో చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే అది అందరికీ ఒక గొప్ప ఒప్పందం అవుతుందని, లేకుంటే ఒప్పందమేదీ ఉండబోదని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలైమతే ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని పేర్కొన్నారు.