24 వేల ఫేక్ అకౌంట్లతో చోరీ.. చైనాపై ఆంథ్రోపిక్ సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:55 PM
అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్.. మూడు చైనా కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ మోడళ్ల సామర్థ్యాలను డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ, మినిమ్యాక్స్ అనే చైనాకు చెందిన ఏఐ ల్యాబ్స్ చోరీ చేస్తోన్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకు అగ్ర దేశాల మధ్య అనేక రకాల పోటీలు జరిగాయి. తాజాగా కృత్రిమ మేధా(ఏఐ) రేసు కనిపిస్తోంది. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య ఈ పోటీ కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ (Anthropic) మూడు చైనా కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ మోడళ్ల సామర్థ్యాలను డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ, మినిమ్యాక్స్ అనే చైనాకు చెందిన ఏఐ ల్యాబ్స్ చోరీ చేస్తోన్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది.
ఈ మూడు ల్యాబ్స్ 24 వేల నకిలీ అకౌంట్లను వినియోగించి, క్లాడ్‌తో 16 మిలియన్ ఇంట్రాక్షన్లను సృష్టించుకున్నాయని ఆంథ్రోపిక్ పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి డిస్టిలేషన్‌కు పాల్పడుతోన్నాయని ఆరోపించింది. ఒక సమర్థవంతమైన ఏఐ మోడల్ ఇచ్చే .. ఫలితం నుంచి అంతగా సామర్థ్యంలేని ఒక చిన్న మోడల్ నేర్చుకునే ప్రక్రియను డిస్టిలేషన్ అంటారు. చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం ఆర్టిఫియల్ ఇంటిజెన్స్ రంగంలో ఈ డిస్టిలేషన్‌ను వినియోగిస్తున్నారు. దీంతో కంపెనీల్లోనే అంతర్గతంగా చిన్న, చౌకైన వర్షన్లను క్రియేట్ చేసుకోవడమనేది సాధారణంగా జరుగుతుంది. ఈ టెక్నిక్‌నే చైనా ఏఐ ల్యాబ్స్ దుర్వినియోగం చేస్తున్నాయని ఆంథ్రోపిక్ చెప్తోంది.
తక్కువ సమయంలోనే అధునాతన సామర్థ్యాలను చైనా సంస్థలు కాపీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. అయితే ఇలా కాపీ చేసే ఏఐ మోడల్స్.. సైబర్ ఎటాక్, ఇతర సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా నిరోధించే రక్షణ వ్యవస్థలను కలిగి ఉండబోవని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. కోడింగ్, ఏజెంటిక్ రీజనింగ్, టూల్ యూజ్, కంప్యూటర్ యూజ్ ఏజెంట్స్, కంప్యూటర్ వర్షన్ వంటి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు పలు చైనా (China) సంస్థలు ఈ పరస్పర చర్య జరిపాయని అమెరికా స్టార్టప్ పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు డిటెక్షన్ సిస్టమ్‌ను మరింత విస్తరిస్తామని తెలిపింది.
మరోవైపు, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ (Dario Amodei)కు అమెరికా రక్షణ శాఖ కేంద్రకార్యాలయం సమన్లు ఇచ్చింది. రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌తో సమావేశమయ్యేందుకు రావాలని అందులో పేర్కొంది. ఈ స్టార్టప్ కొత్త ఫీచర్లలో మిలిటరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా సమన్లు అందాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్