Share News

ముంబై దాడుల మాస్టర్‌మైండ్ తహవ్వుర్ రాణాకు ఎదురుదెబ్బ! కెనడా పౌరసత్వ రద్దుకు రంగం సిద్ధం

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:27 AM

ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ముంబై దాడుల మాస్టర్‌మైండ్ తహవ్వుర్ రాణాకు ఎదురుదెబ్బ! కెనడా పౌరసత్వ రద్దుకు రంగం సిద్ధం
Tahawwur Rana

ఇంటర్నెట్ డెస్క్: ముంబై దాడుల కుట్రదారు, పాక్ సంతతికి చెందిన తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కెనడా ప్రభుత్వం రంగంలోకి దిగింది (Canada Citizenship). త్వరలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ట్రూడో హయాంలో భారత్, కెనడా సంబంధాలు ఒడుదొడుకులకు లోనైన విషయం తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ప్రస్తుతం ప్రధాని కార్నీ భారత్ పర్యటనకు వస్తున్నారు.

తహవ్వుర్ రాణా ప్రస్తుతం భారత్ కస్టడీలోనే ఉన్నాడు. ముంబై దాడులకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై త్వరలో విచారణ మొదలు కానుంది. లష్కర్-ఇ-తొయిబా ప్రోద్బలంతో 2008లో జరిగిన ఈ దాడుల్లో 160 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇక.. పౌరసత్వ రద్దుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్టు కెనడా ప్రభుత్వం ఇటీవలే అతడికి సమాచారం ఇచ్చింది. పౌరసత్వం పొందే క్రమంలో అతడు తప్పుడు సమాచారం సమర్పించడంతో ఆ దేశం ఈ చర్యలకు సమాయత్తమైంది.


తహవ్వుర్ రాణా 1997లో కెనడాకు వెళ్లాడు. 2001లో కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. ఆ సమయంలో తన నివాసం గురించిన తప్పుడు సమాచారాన్ని అధికారులకు సమర్పించాడు. పౌరసత్వ దరఖాస్తుకు మునుపు తాను నాలుగేళ్లుగా ఒటోవా, టొరొంటోల్లో ఉన్నట్టు అతడు చెప్పుకున్నాడు. ఆ సమయంలో కేవలం 6 రోజుల పాటు మాత్రమే కెనడా బయట ఉన్నానని తెలిపాడు. ఈ వివరాలపై కెనడా పోలీసులు దర్యాప్తు జరిపారు. దరఖాస్తుకు ముందు అతడు ఎక్కువగా చికాగోలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ తహవ్వుర్ రాణాకు పలు స్థిరాస్తులు ఉన్నాయని, వ్యాపారాలు చేసేవాడని తెలుసుకున్నారు. దీంతో అతడు తీవ్రమైన మోసానికి పాల్పడినట్టు కెనడా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అంతకాలం విదేశాల్లో ఉన్నా.. ఆ వివరాలను వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి అతడిపై చర్యలకు ఉపక్రమించింది.


ఈ వార్తలనూ చదవండి:

సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్

ఇరాన్‌పై పరిమిత దాడి: ట్రంప్‌

Updated Date - Feb 24 , 2026 | 12:27 PM