24 వేల ఫేక్ అకౌంట్లతో చోరీ.. చైనాపై ఆంథ్రోపిక్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:55 PM
అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్.. మూడు చైనా కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ మోడళ్ల సామర్థ్యాలను డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ, మినిమ్యాక్స్ అనే చైనాకు చెందిన ఏఐ ల్యాబ్స్ చోరీ చేస్తోన్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటివరకు అగ్ర దేశాల మధ్య అనేక పోటీలు జరిగాయి. తాజాగా కృత్రిమ మేథ(ఏఐ) రేసు కనిపిస్తోంది. ప్రధానంగా అమెరికా, చైనాల మధ్య ఈ పోటీ కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్(Anthropic) మూడు చైనా కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ మోడళ్ల సామర్థ్యాలను డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ, మినిమ్యాక్స్ అనే చైనాకు చెందిన ఏఐ ల్యాబ్స్ చోరీ చేస్తున్నాయంది.
ఈ మూడు ల్యాబ్స్ 24 వేల నకిలీ అకౌంట్లను వినియోగించి, క్లాడ్‌తో 16 మిలియన్ ఇంట్రాక్షన్లను సృష్టించుకున్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి డిస్టిలేషన్‌కు పాల్పడుతున్నాయని పేర్కొంది. చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం ఏఐ రంగంలో వినియోగించే ఈ డిస్టిలేషన్ టెక్నిక్ ఆధారంగా చైనా ఏఐ ల్యాబ్స్ దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఆంథ్రోపిక్ వివరిస్తోంది.
తక్కువ సమయంలోనే అధునాతన సామర్థ్యాలను చైనా సంస్థలు కాపీ చేస్తున్నాయని ఆంథ్రోపిక్ వాపోయింది. అయితే ఇలా కాపీచేసే ఏఐ మోడల్స్.. సైబర్ ఎటాక్, ఇతర సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా నిరోధించే రక్షణ వ్యవస్థలను కలిగి ఉండబోవని స్పష్టం చేసింది. కోడింగ్, ఏజెంటిక్ రీజనింగ్, టూల్ యూజ్, కంప్యూటర్ యూజ్ ఏజెంట్స్, కంప్యూటర్ వర్షన్ వంటి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు పలు చైనా సంస్థలు ఈ పరస్పర చర్య జరిపాయని అమెరికన్ స్టార్టప్ పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు అడ్డుకట్టవేసేందుకు డిటెక్షన్ సిస్టమ్‌ను మరింత విస్తరిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు.. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్(Dario Amodei)కు అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం సమన్లు జారీ చేసింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో సమావేశమయ్యేందుకు రావాలని అందులో పేర్కొంది. ఈ ఆంథ్రోపిక్ స్టార్టప్ కొత్త ఫీచర్లలో మిలటరీకి సంబంధించినవి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే తాజా సమన్లు జారీ అయ్యాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్