ఇరాన్‌పై ట్రంప్ దూకుడుకు బ్రేక్!
ABN , Publish Date - Jun 25 , 2026 | 07:00 AM
ఇరాన్‌పై దూకుడు ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రేకులు పడ్డాయి. పశ్చిమాసియాలో మోహరించిన బలగాలను వెనక్కి తీసుకురావడంతోపాటు, సైనిక చర్యలను నిలిపివేయాలని...
యుద్ధ అధికారాల తీర్మానానికి 50 మంది సభ్యుల ఆమోదం
వీరిలో నలుగురు అధికార రిపబ్లికన్లు.. ట్రంప్‌ది ఘోరమైన తప్పిదం
నిరవధిక యుద్ధం చేసేందుకు రాజ్యాంగం అనుమతించలేదు: మీక్స్
శత్రువుకు సాయం చేశారు.. అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్, జూన్ 24: ఇరాన్‌పై దూకుడు ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రేకులు పడ్డాయి. పశ్చిమాసియాలో మోహరించిన బలగాలను వెనక్కి తీసుకురావడంతోపాటు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఆదేశించే యుద్ధ అధికారాల తీర్మానానికి 50:48 తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది. తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన వారిలో అధికార పార్టీ రిపబ్లికన్‌కు చెందిన నలుగురు సభ్యులు ఉండడం గమనార్హం. పార్టీ ఆంక్షలను కూడా తోసిపుచ్చి వీరు తీర్మానానికి మొగ్గు చూపారు. అయితే, డెమొక్రాట్స్‌కు చెందిన పెన్సిల్వేనియా సభ్యుడు జాన్ ఫెట్టెర్‌మన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వాస్తవానికి ఈ తీర్మానాన్ని ఈ నెల ప్రారంభంలోనే చట్టసభ సభ్యులు ఆమోదించారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ఓటింగ్‌లో సభకు హాజరైన వారిలో 50 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం అమల్లోకి వచ్చినట్టు అయింది. దీని ప్రకారం.. ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్య చేపట్టాలన్నా అధ్యక్షుడు ట్రంప్‌కు కాంగ్రెస్ అనుమతి అవసరం అవుతుంది. 1973నాటి యుద్ధ అధికారాల చట్టం కింద ఈ తీర్మానాన్ని తీసుకువచ్చినట్టు డెమొక్రాట్ సభ్యులు తెలిపారు. దీనిపై అధ్యక్షుడి సంతకం అవసరం లేదని పేర్కొన్నారు. సభలో ఓటింగ్‌కు ముందు జరిగిన చర్చలో డెమొక్రాట్ సభ్యుడు చుక్ షుమెర్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ విషయంలో ట్రంప్ చేసింది చారిత్రక తప్పిదం. అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత ఘోరమైన విదేశాంగ చర్యలలో ఒకటిగా ఇది చరిత్రలో నిలుస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్‌పై యుద్ధం సరైనదేనా? అన్న అంశంపై రాయిటర్స్ నిర్వహించిన పోల్ సర్వేలో దేశంలోని 23ు మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన డెమొక్రాట్ సీనియర్ నేత, విదేశాంగ విధానాల స్థాయీ సంఘం సభ్యుడు గెర్గ్ మీక్స్ మాట్లాడుతూ.. ‘‘అమెరికా ప్రజలు గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అల్లాడిపోతున్నారు. ఈ యుద్ధం కారణంగా 13 మంది సైనికులను కోల్పోయాం. ఇరాన్.. ట్రంప్‌ను ఘోరంగా దెబ్బతీసింది.’’ అని అన్నారు. కార్యనిర్వాహక వర్గం కాంగ్రెస్ అభీష్టానికి అనుగుణంగా నడుచుకునేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మీక్స్ అభ్యర్థించారు. కాంగ్రెసే అత్యున్నతమని..విఫలమైన యుద్ధానికి కాంగ్రెస్ ఎన్నడూ అనుమతి ఇవ్వలేదన్నారు.
నన్ను దెబ్బ తీయడానికే ట్రంప్
తనకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించిన సభ్యులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్న సమయంలో, ఇరాన్ పాలకులు తోకముడుస్తున్న సమయంలో తనను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ తీర్మానాన్ని ఆమోదించారని మండిపడ్డారు. ‘‘నేను చేస్తున్న ప్రయత్నాలను మరింత కఠినతరం చేశారు. చర్చల స్థితి సంక్లిష్టంగా మారింది’’ అన్నారు.
ఇరాన్ అణు కేంద్రాలను తనిఖీ చేస్తాం
ఐఏఈఏ డైరెక్టర్ గ్రోసీ వెల్లడి
మేము అనుమతి ఇవ్వలేదు: ఇరాన్
ఇరాన్‌లోని అణు శుద్ధి కేంద్రాలను త్వరలో తమ నిపుణులు తనిఖీ చేస్తారని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ గ్రోసీ తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)లో ఈ అంశం కీలకమైందని పేర్కొన్నారు. జపాన్‌లో మూతపడిన ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇరాన్-అమెరికా సంతకాలు చేసిన ఎంవోయూలో ఇరాన్ అణు కేంద్రాలను ఏఐఈఏ పర్యవేక్షించే అంశం కూడా ఉంది. అణు కేంద్రాల తనిఖీ రేపే జరగొచ్చు.. ఒక వారంలో జరగొచ్చు.. లేదంటే పది రోజుల్లో జరగొచ్చు. తనిఖీ మాత్రం చాలా ముఖ్యమైన అంశం. అయితే, అది తప్పనిసరి కూడా ఏమీ కాదు’ అని పేర్కొన్నారు. గ్రోసీ ప్రకటనను ఇరాన్ మంత్రి ఘరీబాబాదీ ఖండించారు. తమ అణు కేంద్రాల తనిఖీకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని బుధవారం స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!