‘ఇండో’ తీసేసి.. మ్యాప్ మార్చేసి..
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:08 AM
హిందూ-పసిఫిక్ మహాసముద్రాల మధ్య వ్యూహాత్మక అనుసంధానంపై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ‘యూఎ్‌స-ఇండో పసిఫిక్ కమాండ్’గా ఉన్న పేరులో ‘ఇండో’ను తొలగించింది. కేవలం..
పసిఫిక్ కమాండ్ నుంచి ‘ఇండో’ తొలగించిన అమెరికా
ఇక ‘యూఎస్-పసిఫిక్ కమాండే’
బాధ్యతల్లో మార్పులేదు: పెంటగాన్
కమాండ్ మ్యాప్‌లో పీవోకేను
పాక్ భూభాగంగా చూపిన వైనం
వాషింగ్టన్, జూన్ 17: హిందూ-పసిఫిక్ మహాసముద్రాల మధ్య వ్యూహాత్మక అనుసంధానంపై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ‘యూఎ్‌స-ఇండో పసిఫిక్ కమాండ్’గా ఉన్న పేరులో ‘ఇండో’ను తొలగించింది. కేవలం ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా పునరుద్ధరిస్తున్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది. అదేసమయంలో కమాండ్ ఏరియాను పేర్కొనే మ్యాప్‌లోనూ భారత దేశ పరిధిని మార్చేసింది. భారతపరిధిలో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను పాక్ పరిధిలో ఉన్నట్టు చూపింది. వాస్తవానికి 2018 వరకు యూఎస్ పసిఫిక్ కమాండ్‌గానే ఈ పేరు కొనసాగింది. కానీ, అప్పట్లో భారత్‌కు ప్రాధాన్యం కల్పిస్తూ.. ‘ఇండో’ పేరును కూడా చేర్చారు. తాజాగా పాత పేరునే పునరుద్ధరిస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. అయితే.. పసిఫిక్ ప్రాంతంలో అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు కొనసాగుతున్న ప్రాంతీయ సంబంధాల బాధ్యతల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు పేర్కొన్నారు. ‘‘కమాండ్ చారిత్రక మూలాలను గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.’’ అని వివరించారు. కాగా, 1947, జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రూమన్ ఈ కమాండ్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో యూఎస్ పసిఫిక్ కమాండ్(యూఎ్‌సపీఏసీవోఎం)గానే పిలిచేవారు. అయితే, 2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ పసిఫిక్‌ను ‘యూఎ్‌స-ఇండో పసిఫిక్ కమాండ్’గా మార్పు చేశారు. యూఎ్‌స-ఇండో పసిఫిక్ కమాండ్‌లో కేవలం పేరు మాత్రమే మారిందని, ఈ కమాండ్ పరిధిలో ఇతర మార్పులేవీ ఉండబోవని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. భౌగోళిక అంశాలు, బాధ్యతల విషయంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నాయి.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్