భారత్‌కు వెనెజువెలా ముడి చమురు.. అమెరికా ఆఫర్
ABN , Publish Date - Jan 31 , 2026 | 08:08 AM
రష్యా ముడి చమురుకు బదులు వెనెజువెలా నుంచి దిగుమతులు ప్రారంభించాలని భారత్‌కు అమెరికా సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తాజాగా భారత్‌కు కీలక ఆఫర్ చేసింది. వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ప్రారంభించాలని భారత్‌ను కోరింది. రష్యా ముడి చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మీడియా కథనాల ప్రకారం, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకుంటోంది. రాబోయే రోజుల్లో దిగుమతుల్లో మరింత కోత పెట్టే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వెనెజువెలా ప్రభుత్వ రంగ సంస్థ పీడీవీఎస్ఏ స్వయంగా ఈ చమురును భారత్‌కు ఎగుమతి చేస్తుందా? లేక విటోల్, ట్రాఫిగురా లాంటి ప్రైవేటు ట్రేడింగ్ సంస్థలు రంగంలోకి దిగుతాయా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది అదనపు సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జనవరి 3న వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేశాక ఆ దేశ వ్యవహారాలన్నీ అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంది. వెనెజువెలా చమురు రంగంపైనా పట్టు బిగించింది.
2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలయ్యాక భారత్ చమురు దిగుమతుల తీరుతెన్నులు గణనీయంగా మారిన విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చిన రష్యా ముడి చమురును భారత్ భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భారత్‌పై సుంకాలను విధించారు. ఇక ఈ అంశాలపై గతవారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడారు. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గుతున్న తరుణంలో ఇతర దేశాల ముడి చమురుపై భారత్ దృష్టిసారించిందని అన్నారు. అయితే, వెనెజువెలా చమురుపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
రష్యా ముడి చమురు దిగుమతులను రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల దిగువకు కోతపెట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. జనవరిలో భారత్ సగటున రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
ట్యాక్స్ రిటర్న్ లీక్.. అమెరికా ఆర్థిక శాఖపై ట్రంప్ దావా
జెలెన్‌స్కీ.. శాంతి చర్చలకు మాస్కోకి రండి!