అమెరికాకు ఇరాన్ హెచ్చరిక.. మాపై దాడి చేస్తే..
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:10 AM
తమపై జరిగే ఎలాంటి దాడినైనా యుద్ధంగా పరిగణిస్తామని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. తమ శక్తియుక్తులతో దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్ వైపు యుద్ధ నౌకలను తరలించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమపై అమెరికా చేసే ఎలాంటి దాడినైనా యుద్ధంగా పరిగణిస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరించారు. తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించి అమెరికాను ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు (Iran Warns USA). ‘ఈసారి అమెరికా చేసే ఎలాంటి దాడినైనా మేము పూర్తిస్థాయి యుద్ధంగా పరిగణిస్తాము. దీటుగా బదులిస్తాము’ అని సదరు అధికారి హెచ్చరించారు.
కొద్ది రోజుల క్రితం ఇరాన్ విషయంలో ట్రంప్ మెత్తబడినట్టు కనిపించారు. ప్రభుత్వ నిరసనకారుల జోలికి వెళ్లమబోమని ఇరాన్ హామీ ఇచ్చిందని అన్నారు. ఆ తరువాత వెంటనే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలను పెంచింది. ఖమేనీ పాలనకు ముగింపు పలుకుతామని ట్రంప్ హెచ్చరిస్తే తాము ట్రంప్‌ను అంతమొందిస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరించారు. దీంతో, ట్రంప్ మరింతగా రెచ్చిపోయారు. తన జోలికి వస్తే ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత అమెరికా సేనలు ఇరాన్ వైపు కదులుతున్నాయని ప్రకటించారు.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, అబ్రహాం లింకన్ అనే యుద్ధ విమాన వాహక నౌకతో పాటు మూడు డెస్ట్రాయర్లు ప్రస్తుతం మధ్యప్రాచ్యం వైపు కదులుతున్నాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాలు, టామహాక్ మిసైల్స్‌తో ఇవి ముందుకు కదులుతున్నాయి. తాము మాత్రం హైఅలర్ట్‌లో ఉన్నామని ఇరాన్ అధికారులు తెలిపారు. ‘ఈ మోహరింపు దాడుల కోసం కాదనే అనుకుంటున్నాము. కానీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది. అమెరికా నుంచి మేము నిరంతరం ముప్పు ఎదుర్కుంటూనే ఉన్నాము. కాబట్టి, మా శక్తియుక్తులన్నీ ప్రయోగించి అమెరికాను ప్రతిఘటిస్తాము’ అని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
తట్టు మళ్లీ వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త!