తట్టు మళ్లీ వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:18 AM
ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించి, కొంతకాలంగా కనుమరుగైన తట్టు(మీజిల్స్) వ్యాధి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రధానంగా పిల్లలకు సంక్రమించే తట్టు కేసులు పలు దేశాల్లో నమోదవుతున్నాయి.
వాషింగ్టన్, జనవరి 23: ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించి, కొంతకాలంగా కనుమరుగైన తట్టు(మీజిల్స్) వ్యాధి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రధానంగా పిల్లలకు సంక్రమించే తట్టు కేసులు పలు దేశాల్లో నమోదవుతున్నాయి. అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని స్పార్టన్‌బర్గ్‌లో.. స్వల్పంగా మొదలైన తట్టు కేసులు ఈ నెలకు ఏకంగా 550కి చేరుకున్నాయి. దీంతో పాఠశాలలు మూసివేశారు. అమెరికా పొరుగునున్న మెక్సికో, కెనడా దేశాల్లో కూడా తట్టు కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఇండొనేషియాలో 14 వేల కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్, యెమెన్‌లలోనూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే.. 2022లో మహారాష్ట్ర, కేరళ, ఝార్ఖండ్, గుజరాత్‌లలో 32 వేల కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం.. కొవిడ్ అని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ సమయంలో చాలా దేశాల్లో పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్లు వేయించలేదని, అదే ఇప్పుడు తట్టు మళ్లీ తలెత్తటానికి కారణమైందని చెబుతున్నారు. వాస్తవానికి తట్టుపై రెండు డోసుల ఎంఎంఆర్(మీజిల్స్, మంప్స్, రూబెల్లా) వ్యాక్సిన్ బ్రహ్మాస్త్రంలా పని చేస్తుంది. ప్రపంచం తట్టును దాదాపుగా నిర్మూలించిందంటే అది ఈ వ్యాక్సిన్ వల్లే. కానీ, నేడు పరిస్థితులు తిరగబడుతున్నాయి.