Share News

ఇరాన్‌ వైపు అమెరికా సేనలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:26 AM

ఇరాన్‌పై అమెరికా దాడికి రంగం సిద్ధమవుతోందా? సైనిక చర్య ఇప్పట్లో ఉండబోదన్న ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? ఏ క్షణమైనా ఇరాన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందా.....

ఇరాన్‌ వైపు అమెరికా సేనలు

  • పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న ట్రంప్‌

  • యుద్ధ విమాన వాహక నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను పంపినట్టు వెల్లడి

  • ఇరాన్‌, అమెరికా పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకున్న అమెరికా ట్రంప్‌ నిర్ణయంపై అమెరికా నిపుణుల మండిపాటు

వాషింగ్టన్‌, జనవరి 23: ఇరాన్‌పై అమెరికా దాడికి రంగం సిద్ధమవుతోందా? సైనిక చర్య ఇప్పట్లో ఉండబోదన్న ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? ఏ క్షణమైనా ఇరాన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందా? ట్రంప్‌ ప్రకటనలు, పశ్చిమాసియా, గల్ఫ్‌ ప్రాంతాల్లో అమెరికా సైన్యం కదలికలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలను ఖమేనీ ప్రభుత్వం పాశవికంగా అణచివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌.. ఆందోళనకారులకు సహాయం వస్తోందని, దాడికి సిద్ధమని వారం క్రితమే ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో దాడిని వాయిదా వేశారు. కానీ కొన్ని రోజులుగా ట్రంప్‌, ఇరాన్‌ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఖమేనీ పాలనకు అంతం తప్పదని ట్రంప్‌ పేర్కొనడం, ఖమేనీ జోలికి వస్తే ట్రంప్‌ను చంపేస్తామని ఇరాన్‌ ఉన్నతాధికారులు ప్రకటించడం, తన జోలికి వస్తే ఇరాన్‌ అసలు భూమ్మీదే లేకుండా పోతుందని ట్రంప్‌ హెచ్చరించడం.. ఇలా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి తరుణంలో ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక యుద్ధ నౌక సహా భారీ స్థాయిలో నౌకా దళం గల్ఫ్‌ వైపు ప్రయాణిస్తోందన్నారు. ఇరాన్‌లో పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దావోస్‌ సదస్సు నుంచి అమెరికాకు తిరిగి వెళుతూ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘పశ్చిమాసియా వైపు చాలా నౌకలు వెళుతున్నాయని మీకు తెలుసు. చాలా పెద్ద బలగం ఇరాన్‌ వైపు వెళుతోంది. అయితే దాన్ని వినియోగించాల్సిన అవసరం రాకపోవచ్చు’’ అని చెప్పారు. అమెరికా ఒత్తిడితోనే 837 మంది ఆందోళనకారులను ఉరితీయకుండా ఇరాన్‌ ఆపిందని పేర్కొన్నారు. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ ప్రాసిక్యూటర్‌ మహమ్మద్‌ మొవహెది ఖండించారు. ఆందోళనకారులను ఉరితీయాలన్న నిర్ణయమేదీ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీసుకోలేదని, ట్రంప్‌ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌ ఆందోళనల్లో మృతి చెందినవారి సంఖ్య 5 వేలు దాటిందని అమెరికాకు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది.


వైమానిక దళమేదీ?

అమెరికాకు చెందిన భారీ విమాన వాహక యుద్ధ నౌక యూఎ్‌సఎస్‌ లింకన్‌, దానికి అనుబంధంగా ఉండే పలు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామితో కూడిన బృందం రెండు, మూడు రోజుల క్రితమే.. దక్షిణ చైనా సముద్రం నుంచి గల్ఫ్‌ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ నౌకలు హిందూ మహా సముద్ర ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఒకట్రెండు రోజుల్లో పర్షియన్‌, గల్ఫ్‌ ప్రాంతానికి చేరుకోనున్నాయి. లింకన్‌ నౌకపై ఎఫ్‌-15ఈ, ఎఫ్‌-35సీ, ఎఫ్‌/ఏ -18 వంటి ఫైటర్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చే ముందు కరీబియన్‌ సముద్ర ప్రాంతంలో మోహరించిన బలగాల్లోని.. సీ-17 సైనిక రవాణా విమానాలు, పేట్రియాట్‌, థాడ్‌ క్షిపణి వ్యవస్థలు, ఆయుధాలను కూడా ఇరాన్‌ వైపు తరలిస్తున్నారు. అయితే ట్రంప్‌ ప్రకటించినట్టుగా భారీ స్థాయిలో బలగాల మోహరింపు ఏదీ కనబడటం లేదని రక్షణ రంగ విశ్లేషకులు శుక్రవారం పేర్కొన్నారు. తాము శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించామన్నారు. ఇరాన్‌ చుట్టూ ఉన్న అమెరికా ఎయిర్‌బే్‌సలలో యుద్ధ విమానాల మోహరింపు పెద్దగా కనబడటం లేదని.. హిందూ మహా సముద్రంలోని డీయెగో గార్సియా స్థావరంలో మాత్రం బీ2 బాంబర్లు, యుద్ధ విమానాలు ఉన్నాయని ది వార్‌జోన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే ఈ బలగాలు భారీ స్థాయి దాడికి సరిపోతాయా అన్నది ప్రశ్నార్థకమేనని వెల్లడించింది.

Updated Date - Jan 24 , 2026 | 08:00 AM