శాంతి.. శాంతి!
ABN , Publish Date - Jun 16 , 2026 | 06:11 AM
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా...
19న సంధిపై సంతకాలు.. జెనీవాలో ఇరాన్‌తో ఒప్పందం
హోర్ముజ్ నుంచి తొలి నౌక భారత్‌కే..
18న గుజరాత్‌కు ‘దిశ’ ట్యాంకర్
డీల్‌పై ఇప్పటికే డిజిటల్‌గా సంతకాలు జరిగాయి
60 రోజులపాటు ఒప్పందం అమలులో ఉంటుంది
ఆ సమయంలో శాశ్వత సంధిపై మలిదఫా చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
హోర్ముజ్ జలసంధి ఇప్పటికే తెరుచుకుందని వెల్లడి
ధ్రువీకరించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ
తాత్కాలిక అవగాహనా ఒప్పందమే: ఇరాన్ మీడియా
ఎంవోయూలో 14 కీలక అంశాలున్నాయని వెల్లడి
ఒప్పందంతో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్
60 రోజుల తర్వాత హోర్ముజ్‌లో టోల్ వసూలు!
హోర్ముజ్‌లో మా దళాల గస్తీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
వాషింగ్టన్/ టెహ్రాన్, జూన్ 15: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా రెండు దేశాలు సంతకాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఒప్పందంపై డిజిటల్‌గా ఇప్పటికే సంతకాలు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా తెరిచిందని, చమురు నౌకలు ప్రయాణం కూడా మొదలుపెట్టాయని తెలిపారు. 19న జలసంఽధిని పూర్తిగా తెరుస్తారని అన్నారు. ఈ ఒప్పందం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి సంధి కోసం తదుపరి చర్చలు జరుగుతాయని తెలిపారు. ‘ఇరాన్‌తో డీల్ పూర్తయింది. ప్రపంచానికి శుభాకాంక్షలు. శుక్రవారం స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు చేయగానే హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. ఈ 60 రోజులు వాణిజ్య నౌకలు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇరాన్ పోర్టులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని వెంటనే తొలగించాలని మా నావికాదళానికి కూడా ఆదేశాలిచ్చాను’ అని ట్రూత్ సోషల్‌లో తెలిపారు. ఒప్పందంపై డిజిటల్‌గా ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఘలిబాఫ్, మరో ఇరాన్ సీనియన్ నాయకుడు సంతకాలు చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. 19న జరిగేది లాంఛనప్రాయ కార్యక్రమమేనని పేర్కొంది. డిజిటల్ సంతకాలు జరిగిన విషయాన్ని జేడీ వాన్స్ కూడా ధ్రువీకరించారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ మొదటిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, అది శాంతి ఒప్పందం కాదని, అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మాత్రమేనని ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ ఒప్పందం సజావుగా అమలయ్యేలా చూసే బాధ్యత అమెరికాదేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ సోమవారం స్పష్టంచేశారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలువరించే బాధ్యత కూడా అమెరికాదేనన్నారు. కచ్చితమైన షరతుల మేరకే ఈ ఒప్పందానికి తాము అంగీకారం తెలిపామని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి కాజెమ్ ఘరిబబాది అన్నారు. కాగా, ఒప్పందంలో 14 ప్రధాన అంశాలు ఉన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే, అమెరికా గానీ, ఇరాన్ గానీ ఒప్పందంలోని అంశాలను అధికారికంగా బయటపెట్టలేదు. కాగా, శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హోర్ముజ్‌లో వాణిజ్య నౌకల రక్షణకు గస్తీ కాసేందుకు తమ నౌకాదళాన్ని మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు. రెండుమూడు రోజుల్లోనే తమ విమాన వాహక నౌక చార్లెస్ డీ గెలీలీని మోహరించగలమని పేర్కొన్నారు.
ఇరాన్‌కు భారీగా నిధులు..
శాంతి ఒప్పందం ద్వారా ఇరాన్‌కు భారీగా నిధులు సమకూరనున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. వివిధ దేశాల్లో ఇరాన్‌కు ఉన్న దాదాపు 25 బిలియన్ డాలర్ల(రూ.2.37 లక్షల కోట్లు) నిధులను అమెరికా గతంలో స్తంభింపజేసింది. వీటిలో ఈ ఒప్పందంపై సంతకాలు కాగానే సగం నిధులను ఇరాన్ తీసుకొనేందుకు అమెరికా అంగీకరించినట్లు సమాచారం. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి సంధి కుదిరితే యుద్ధం, ఆంక్షల వల్ల నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి 300బిలియన్ డాలర్ల (28.41 లక్షల కోట్లు)ను వివిధ మార్గాల ద్వారా సమకూర్చేందుకు అమెరికా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయనుండటంతో ఆ దేశానికి భారీగా నిధులు వచ్చిపడనున్నాయి.
మా ఆధ్వర్యంలోనే సంతకాలు: పాక్ ప్రధాని
స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగే శాంతి ఒప్పంద కార్యక్రమానికి పాకిస్థాన్ నాయకత్వం వహిస్తుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. తమ సమక్షంలోనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని పేర్కొన్నారు. చర్చలకు సహకరించిన తుర్కియే, ఖతార్, సౌదీ, ఈజిప్టు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒప్పందాన్ని ఎలా అమలుచేయాలన్న అంశంపై మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.
మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని తెగేసి చెప్పినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ‘ఈ ఒప్పందం ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచం మొత్తానికి చెడు చేస్తుంది. అమెరికాతో కలిసి మేము ఇరాన్‌పై నిర్వహించిన సంయుక్త మిలిటరీ ఆపరేషన్‌లో ఎంతో సాధించాం. అదంతా ఇప్పుడు వృథా కారాదు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా, ఆ దేశ ప్రస్తుత పాలకులను తొలగించేందుకు మేమే సొంతంగా భిన్న మార్గాల్లో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. లెబనాన్‌లో హెజ్బొల్లాను పూర్తిగా తుదముట్టించే వరకు మా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం’ అని ఇజ్రాయెల్ ఆర్థికమంత్రి బెజలెల్ స్మాట్రిక్ ప్రకటించారు. ఇజ్రాయెల్ సర్వస్వతంత్ర దేశమని, అమెరికా చెప్పినట్లు వినాల్సిన అవసరం తమకు లేదని జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇటమన్ బెన్ గ్రివ్ తేల్చిచెప్పారు.
ఇరాన్ మీడియా వెల్లడించిన 14 అంశాలు..
1. ఇరుపక్షాలుదాడులను వెంటనే నిలిపివేయాలి.
2. ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే వాణిజ్య నౌకల కోసం హోర్ముజ్‌ను తెరవాలి.
3. ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళం దిగ్బంధనం తొలగించాలి.
4. శాశ్వత సంధి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించరాదు.
5. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను తాత్కాలికంగా సడలించాలి.
6. విదేశాల్లోని ఇరాన్ ఆస్తులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి.
7. 60 రోజుల్లో శాశ్వత శాంతి సంధి కోసం చర్చలు జరపాలి.
8. అణ్వాయుధాలను సమకూర్చుకోనన్న మాటకు ఇరాన్ కట్టుబడి ఉండాలి.
9. ఇరాన్ యురేనియం శుద్ధిని నిలిపివేయాలి.
10. అణు కార్యక్రమ విస్తరణను నిలిపివేయాలి.
11. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియంపై చర్చలు కొనసాగించాలి.
12. పశ్చిమాసియాలో సైనిక మోహరింపును తగ్గించాలి.
13. ఇరాన్ ఆర్థిక, పునర్నిర్మాణ అంశాలపై చర్చలు కొనసాగించాలి.
14. తుది సమగ్ర శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!