పశ్చిమాసియాలో విధ్వంసం!
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:58 AM
పశ్చిమాసియా మళ్లీ మంటల్లో చిక్కుకుంది. ఇరాన్, అమెరికా పరస్పర దాడుల్లో ఇరువైపులా విధ్వంసం చోటుచేసుకుంటోంది. భారీగా మౌలిక సదుపాయాలు...
ఇరాన్, అమెరికా పరస్పర దాడుల్లో ఇరువైపులా భారీగా నష్టం
ఇరాన్‌పై భీకర దాడులకు దిగిన అమెరికా
చాబహార్ పోర్టు కు తీవ్ర నష్టం
అమెరికా స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్
కువైట్‌లో విద్యుత్, డీసాలినేషన్ ప్లాంట్లు ధ్వంసం
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, జూలై 17: పశ్చిమాసియా మళ్లీ మంటల్లో చిక్కుకుంది. ఇరాన్, అమెరికా పరస్పర దాడుల్లో ఇరువైపులా విధ్వంసం చోటుచేసుకుంటోంది. భారీగా మౌలిక సదుపాయాలు నాశనం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినట్టుగానే ఇరాన్‌లో కీలక వంతెనలు, రోడ్లు, రైల్వే, విద్యుత్ వ్యవస్థలపై అమెరికా దళాలు భీకర దాడులకు తెగబడ్డాయి. పలు విమానాశ్రయాలు, చాబహార్ పోర్టులోని కీలక మౌలిక సదుపాయాలనూ నాశనం చేశాయి. అటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలనూ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తూ.. భారీగా నష్టం కలిగిస్తోంది.
మౌలిక సదుపాయాలే లక్ష్యంగా..
వరుసగా ఆరో రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇరాన్‌పై అమెరికా ఉధృతంగా దాడులు చేసింది. ఇరాన్‌లో ఖేష్మ్ దీవిని, బందర్ అబ్బాస్, బందర్ ఖమీర్, సిరిక్, బుషెహర్, అహ్వాజ్ సహా దక్షిణ తీరం వెంట ఉన్న దాదాపు అన్ని రేవు పట్టణాలనూ లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ అవతల గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్న కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా మూడోసారి బాంబుల వర్షం కురిపించింది. దీనితో పోర్టులోని నిఘా టవర్, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌ను, కీలకమైన బందర్ అబ్బాస్ పోర్టును అనుసంధానించే హైవే, రైల్వే వంతెనలు, ఒక రైల్వే స్టేషన్, ఇరాన్‌షహర్ విమానాశ్రయం కూడా అమెరికా దాడుల్లో దెబ్బతిన్నాయి. అమెరికా దాడుల్లో శుక్రవారం ఎనిమిది మంది మృతిచెందారని, 20 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. అమెరికా దాడుల్లో విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడంతో సరఫరాకు ఇబ్బంది ఎదురవుతోంది. దీనితో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది.
అమెరికా విమానాలు ధ్వంసం!
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా భారీస్థాయిలో దాడులు చేపట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి వరుసగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. కువైట్, ఖతార్‌లలోని అమెరికా ఎయిర్‌బే్‌సలో మౌలిక సదుపాయాలు, హిమార్స్ క్షిపణి లాంఛర్లను, ఒమన్‌లోని తీరప్రాంత నిఘా రాడార్లను, బహ్రెయిన్ ఎయిర్‌బే్‌సలో హెలికాప్టర్లు, నిఘా విమానాన్ని, జోర్డాన్ స్థావరంలో పలు అమెరికా ఫైటర్లు, ఇంధనాన్ని నింపే విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఇక తమ దేశ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులకు ప్రతిగా.. అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలనూ ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ దాడుల్లో కువైట్‌లోని ఒక విద్యుత్ ప్లాంటు, సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంటు ధ్వంసమయ్యాయి.
ట్రంప్‌ను చంపితే.. రూ.96 కోట్లు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపితే రూ.96 కోట్లు (మిలియన్ డాలర్లు) నజరానా ఇస్తామని ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ప్రకటించింది. ఇరాన్ జనరల్ ఖసేమ్ సోలేమానీ, ఇరాకీ మిలీషియా నేత అబు మహద్దీ అల్ ముహందీలను అమెరికా చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను చంపేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
హోర్ముజ్‌లో రాకపోకలు బంద్!
ఇటు ఇరాన్ హెచ్చరికలు, అటు అమెరికా దిగ్బంధంతో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. బుధవారం 10 వరకు నౌకలు హోర్ముజ్ దాటగా, గురువారం 3 మాత్రమే దాటాయని నౌకా రవాణా సంస్థలు వెల్లడించాయి. కాగా, బ్రిటన్ శుక్రవారం ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ)ను తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుకలిగించే సంస్థల జాబితాలో చేర్చింది. దేశంలో ఐఆర్‌జీసీకి ఎవరు మద్దతు ప్రకటించినా 14 ఏళ్ల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు