Share News

సౌదీకి షాక్‌ హూతీలతో అమెరికా డీల్‌?

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:22 AM

పశ్చిమాసియాలో తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన సౌదీ అరేబియాకు అమెరికా గట్టి షాకిచ్చింది. రాకెట్‌ దాడులతో సౌదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యెమెన్‌లోని తిరుగుబాటుదారులైన హూతీలతో అమెరికా శాంతి ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

సౌదీకి షాక్‌ హూతీలతో  అమెరికా డీల్‌?
America

  • ఎర్ర సముద్రంలో నౌకల్ని కాపాడుకొనేందుకే..

హూతీల దాడులు ఎదుర్కొనేందుకు

అమెరికా సాయం కోరిన సౌదీ

  • ప్రత్యక్ష దాడులకు నిరాకరించి గుట్టుచప్పుడు

కాకుండా హూతీలతోనే అమెరికా డీల్‌

  • ఎర్రసముద్రంలో తమ నౌకల రక్షణ కోసమే.. సౌదీ విన్నపాన్ని తిరస్కరించి హూతీల తో అమెరికా ఒప్పందం!

  • పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ సైరన్లు

  • కోడ్‌ 100ను యాక్టివేట్‌ చేసిన ఇరాన్‌!

  • సాయుధ బలగాలన్నీ సంపూర్ణ

యుద్ధానికి సిద్ధమైనట్లు సంకేతం

  • వారాంతపు విహారం నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు

  • ఇరాన్‌ పై భారీ దాడులకు

సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు

దుబాయ్‌, సెప్టెంబరు 21: పశ్చిమాసియాలో తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన సౌదీ అరేబియాకు అమెరికా గట్టి షాకిచ్చింది. రాకెట్‌ దాడులతో సౌదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యెమెన్‌లోని తిరుగుబాటుదారులైన హూతీలతో అమెరికా శాంతి ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. నిజానికి హూతీలపై పోరులో తనకు ప్రత్యక్షంగా సాయం చేయాలని అమెరికాను సౌదీ కోరింది. ఇరాన్‌ మద్దతుతో చెలరేగిపోతున్న హూతీలపై వైమానిక దాడులు నిర్వహించాలని విన్నవించింది. ఆ విన్నపాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. ఇటీవల యెమెన్‌ పశ్చిమ, దక్షిణ తీరప్రాంతాన్ని మొత్తం హూతీలు

స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధిపై గురిపెట్టారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఈ జలసంధి అత్యంత కీలకమైంది. ఆసియా-యూరప్‌- అమెరికా మధ్య వాణిజ్య నౌకల రాకపోకలు ఎక్కువగా ఈ మార్గంలోనే సాగుతుంటాయి. దీంతో ఈ మార్గం ద్వారా వచ్చే తమ నౌకలపై దాడులు చేయకుండా హూతీలతో అమెరికా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అమెరికా నౌకలపై దాడులు చేయబోమని హూతీల రాజకీయ విభాగం సభ్యుడు మొహమెద్‌ అల్‌ బుఖైతీ సోమవారం ప్రకటించారు.


అయితే, సౌదీకి మద్దతిచ్చే దేశాల నౌకలపై మాత్రం దాడులు చేస్తామని హెచ్చరించారు. మక్కా రక్షణ సహకార ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని తమపై పాకిస్థాన్‌, తుర్కియేలు దాడి చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.

కోడ్‌ 100ను యాక్టివేట్‌ చేసిన ఇరాన్‌

కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. ఎవరు ఎవరిపై ఎప్పుడు దాడులు చేస్తారోనన్న భయంతో ఆ ప్రాంతంలోని దేశాలన్నీ ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యాయి. ఇరాన్‌ తన అత్యున్నత యుద్ధ సన్నద్ధతకు సంకేతమైన ‘కోడ్‌ 100’ను యాక్టివేట్‌ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. దేశంపై దురాక్రమణ జరిగే ప్రమాదం ఉన్నప్పుడు తన సైన్యంతోపాటు సాయుధ బలగాలన్నింటినీ సంపూర్ణ యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశిస్తూ ప్రతిదేశం తమదైన ఒక కోడ్‌ను జారీచేస్తుంది. ఇరాన్‌ జారీచేసిన కోడ్‌ 100 కూడా అలాంటిదే. పూర్తిస్థాయి యుద్ధం వచ్చే సమయంలోనే ఈ కోడ్‌ను జారీచేస్తారు. ఇది జారీచేయటం అంటే ఏ క్షణమైనా యుద్ధరంగంలోకి దిగటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం. ముఖ్యంగా శత్రుదేశంతో భూమార్గంలో ముఖాముఖి తలపడాల్సిన వచ్చినప్పుడు దీనిని జారీచేస్తుంటారు. ఇరాన్‌లో సంప్రదాయ సైన్యంతోపాటు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ), ఎయిర్‌ఫోర్స్‌, నేవీ, ఇతర రిజర్వ్‌ ఫోర్స్‌ దళాలు కూడా ఉన్నాయి. కోడ్‌ 100 జారీకావటంతో ఈ దళాలన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. తమపై అమెరికా మళ్లీ దాడులకు దిగితే యుద్ధ స్వరూపాన్నే మార్చేస్తామని ఐఆర్‌జీసీ ప్రతినిధి హొస్సేన్‌ మొహబ్బి సోమవారం హెచ్చరించారు. ఇప్పటి వరకు వాడని సరికొత్త ఆయుధాలతో, ఇప్పటివరకు టార్గెట్‌ చేయని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ప్రకటించారు. సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


అమెరికా పౌరులకు సెక్యూరిటీ అలర్ట్‌ జారీ

కొన్నిరోజులుగా భారీ దాడులు లేకుండా ప్రశాంతంగా ఉన్న మధ్య ఆసియాలో ఆది, సోమవారాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ప్రాంతంలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని అమెరికా సోమవారం అలర్ట్‌ జారీచేసింది. పలు ప్రాంతాలపై దాడులు జరగొచ్చని, విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విశ్రాంతి కోసం శనివారం క్యాంప్‌ డేవిడ్‌కు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. షెడ్యూల్‌ సమయం కంటే ముందే వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఈ అలర్ట్‌ జారీ అయ్యింది. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా తన పర్యటనను కుదించుకొని స్వదేశం చేరుకున్నారు. దీంతో యుద్ధం మళ్లీ మొదలు కాబోతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లనున్న ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ బృందంలోని కొందరు అధికారులకు అమెరికా వీసాలు నిరాకరించినట్లు ఇరాన్‌ మీడియా సోమవారం వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు

అది డ్రోనా.. లేక ప్లేనా..? ఇరాన్‌ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ.. వీడియో వైరల్

Updated Date - Sep 22 , 2026 | 02:23 AM