Share News

నాలుగేళ్లు దాటితే అక్రమమే..!

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:22 AM

విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో...

నాలుగేళ్లు దాటితే అక్రమమే..!

  • అమెరికాలో విదేశీ విద్యార్థుల చదువు గడువుపై షరతులు

  • గడువు పొడిగింపునకు.. ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి

  • డ్యురేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానాన్ని రద్దుచేసిన ట్రంప్‌ సర్కారు

న్యూయార్క్‌, జూలై 16: విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఎఫ్‌-1 వీసాపై చదివే విద్యార్థులు నాలుగేళ్లలో కోర్సు పూర్తిచేయలేక అక్కడే ఉంటే అక్రమ వలసదారులుగా పరిగణిస్తామని ప్రకటించింది. నాలుగేళ్లలో కోర్సు పూర్తిచేయలేని పక్షంలో.. మరికొంతకాలం పొడిగించుకొనేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులు తమ కోర్సులు పూర్తిచేయటానికి నాలుగేళ్ల సాధారణ గడువు ఉంది. అప్పటికీ పూర్తిచేయలేకపోతే ఆయా యూనివర్సిటీలను సంప్రదించి గడువును మరికొంతకాలం పొడిగించుకోవచ్చు. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి, నివాస అనుమతిని కూడా పొడిగించుకుంటారు. దీనినే ‘డ్యురేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ అంటారు. చాలామంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఎక్కువకాలం ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే కోర్సులను సకాలంలో పూర్తిచేయటం లేదని ట్రంప్‌ ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటి ప్రకారం విదేశీ విద్యార్థి నాలుగేళ్లలో కోర్సు పూర్తిచేయలేకపోతే.. గడువు పొడిగింపు కోసం ఇప్పటిలా యూనివర్సిటీ నుంచి కాకుండా డీహెచ్‌ఎ్‌స నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే నాలుగేళ్ల గడువు ముగిసినా అక్రమ వలసదారుగానే పరిగణిస్తారు. జే-1 వీసాపై వెళ్లే పర్యాటకులు, ఐ వీసాతో వెళ్లే మీడియా ప్రతినిధులకు కూడా నివాస గడువుపై కఠిన ఆంక్షలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి రాలేదని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ తెలిపింది. వీటిని చట్టసభ పరిశీలన (కాంగ్రెషనల్‌ రివ్యూ) కోసం పంపారని, అక్కడ ఆమోదం లభించిన తర్వాత అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘ఓపెన్‌ డోర్స్‌-2024’ నివేదిక ప్రకారం అమెరికాలోని వర్సిటీలు, కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 3,31,000 భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది దాదాపు 30 శాతం. తాజా నిబంధనలతో వీరిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


గ్రీన్‌కార్డుకు లక్ష డాలర్లు..

అమెరికా వెలుపల నుంచి గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే కొద్దిమంది దరఖాస్తుదారులు లక్ష డాలర్ల రిఫండబుల్‌ బాండ్‌ సమర్పించాలన్న ప్రతిపాదనను కూడా ట్రంప్‌ యంత్రాంగం పరిశీలిస్తోంది. అధికారిక ప్రకటన లేనప్పటికీ గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల్లో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని దేశాల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అవి ఏ దేశాలు, ఎవరి నుంచి బాండ్‌ తీసుకుంటారు? అన్న అంశాలపై స్పష్టత లేదు. విదేశాల్లోని అమెరికన్‌ కాన్సులేట్ల నుంచి గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు, ఆమోదం పొందడానికి ముందే ఈ లక్ష డాలర్ల బాండు సమర్పించాలి. ఈ గ్రీన్‌ కార్డు ప్రక్రియ సుదీర్ఘమైనది. ఐదేళ్లు, అంతకు మించి సమయం పట్టే అవకాశం ఉంది. దరఖాస్తు ఆమోదం పొంది, గ్రీన్‌ కార్డుతో అమెరికాలో అడుగుపెట్టిన తరువాత మాత్రమే బాండు తిరిగి ఇస్తారు. ఇప్పటికే యూఎ్‌సలో నివసిస్తున్న దరఖాస్తుదారుని కుటుంబ సభ్యులు వారి తరఫున బాండ్‌ సమర్పించవచ్చు. కాగా, యూఎస్‌ ప్రభుత్వం ఏడాదికి 1.40 లక్షల గ్రీన్‌ కార్డులను జారీ చేస్తుంది. భారతీయులకు అత్యధికంగా ఏడాదికి 9,800 వీసాలు మాత్రమే వస్తున్నాయి. అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. ట్రంప్‌ యంత్రాంగం.. తాజా ప్రతిపాదనను ఇండియాలోనూ అమలు చేయాలని భావిస్తే అది గ్రీన్‌కార్డు వీసా దరఖాస్తుదారులకు భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 06:22 AM