ప్రొటెక్ట్ అవర్ నైబర్స్.. వలసదారుల కోసం డెమొక్రాట్ల కొత్త బిల్లు..
ABN , Publish Date - Nov 28 , 2026 | 07:19 PM
అమెరికాలో డిపోర్టేషన్ ముప్పు ఎదుర్కొంటున్న కొందరు వలసదారులకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం కల్పించేలా డెమొక్రాట్లు కొత్త బిల్లును ప్రతిపాదించారు. కాలిఫోర్నియాకు చెందిన నలుగురు డెమొక్రటిక్ ప్రతినిధులు నవంబర్ 19న ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్ పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్, నవంబర్ 28: అమెరికాలో డిపోర్టేషన్ ముప్పు ఎదుర్కొంటున్న కొందరు వలసదారులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) పొందే అవకాశం కల్పించేలా డెమొక్రాట్లు కొత్త బిల్లును ప్రతిపాదించారు. కాలిఫోర్నియాకు చెందిన నలుగురు డెమొక్రటిక్ ప్రతినిధులు నవంబర్ 19న ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్ (Protect Our Neighbors Act) పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అమెరికాలో నివసిస్తున్న ప్రతి వలసదారుడికీ ఈ అవకాశం లభించదు. నిర్దిష్ట నిబంధనలు, అర్హతలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఈ బిల్లు ప్రధానంగా తుది డిపోర్టేషన్ ఆదేశాలను ఎదుర్కొంటూ, చాలా సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠినమైన చర్యలు కొనసాగిస్తున్న వేళ ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎవరికి గ్రీన్ కార్డ్ ఇస్తారు..?
ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్ ప్రకారం.. తుది డిపోర్టేషన్ ఆదేశాలు జారీ అయిన తర్వాత కనీసం పదేళ్లపాటు నిరంతరంగా అమెరికాలో నివసించిన వారికి గ్రీన్ కార్డ్ పొందే అవకాశం లభిస్తుంది. వారి డిపోర్టేషన్ ఆదేశాలు బిల్లులో పేర్కొన్న నిర్దిష్ట ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలకు సంబంధించినవై ఉండాలి. అలాగే, సదరు వలసదారులు ప్రభుత్వం విధించిన పర్యవేక్షణ లేదా షరతులతో కూడిన విడుదల నిబంధనలను పాటించి ఉండాలి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకుని పారిపోయి ఉండకూడదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిర్దిష్ట నేరపరమైన లేదా జాతీయ భద్రతకు సంబంధించిన అనర్హత నిబంధనల పరిధిలోకి రాకూడదు. తమ తాజా ఫెడరల్ ఆదాయపు పన్ను రిటర్న్ ధ్రువీకరించిన ప్రతిని సమర్పించాలి. అయితే, ఈ అర్హతలు ఉన్నంత మాత్రాన గ్రీన్ కార్డు ఆటోమేటిక్‌గా మంజూరు కాదు. దరఖాస్తును పరిశీలించిన తర్వాతే సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
దరఖాస్తు రుసుము ఎంత..?
దరఖాస్తుదారుల నుంచి ఒకేసారి గరిష్ఠంగా 1,200 డాలర్ల వరకు రుసుము వసూలు చేసే అధికారాన్ని సంబంధిత ప్రభుత్వ శాఖకు కల్పించాలని ప్రతిపాదించారు. అర్హతలను పరిశీలించిన అనంతరం అటార్నీ జనరల్ లేదా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి సంబంధిత డిపోర్టేషన్ ఆదేశాలను రద్దు చేసే అధికారులు ఉంటాయి. అలాగే, అర్హులైన వారికి చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కల్పించే అవకాశం ఉంటుంది.
ఎంతమందికి ప్రయోజనం..?
అమెరికాలో తుది డిపోర్టేషన్ ఆదేశాలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలో పేర్కొన్న ICE గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరి 26 నాటికి సుమారు 16 లక్షల మంది తుది డిపోర్టేషన్ ఆదేశాలతో ICE నాన్-డిటెయిన్డ్ జాబితాలో ఉన్నట్లు అంచనా. అయితే, ఈ 16 లక్షల మందికీ కొత్త బిల్లు ద్వారా గ్రీన్ కార్డు వస్తుందని అర్థం కాదు. బిల్లులో పేర్కొన్న అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.
బిల్లు ఎప్పుడు అమల్లోకి వస్తుంది..?
ఈ ప్రతిపాదన ప్రస్తుతం చట్టంగా మారలేదు. నవంబర్ 19న బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం, దానిని అమెరికా ప్రతినిధుల సభ న్యాయవ్యవహారాల కమిటీకి పంపించారు. ఈ బిల్లు చట్టంగా మారాలంటే అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఆమోదం పొందాలి. అలాగే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంటుంది.
బిల్లుపై హర్జిత్ కౌర్ ఉదంత ప్రభావం
ఈ బిల్లు ప్రతిపాదన వెనుక దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఉన్నాయి. భారత సంతతికి చెందిన హర్జిత్ కౌర్ (73) ఉదంతాన్ని ఈ ప్రతిపాదన సందర్భంగా మద్దతుదారులు ప్రస్తావిస్తున్నారు. ఆమె మూడు దశాబ్దాలకు పైగా కాలిఫోర్నియాలో నివసించారు. అక్కడే తన పిల్లలను పెంచి, తర్వాత మనవళ్ల ఆలనాపాలనలోనూ సహకరించారు. 2025 సెప్టెంబర్‌లో సాధారణ ఇమ్మిగ్రేషన్ చెక్-ఇన్‌కు హాజరైన సమయంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారత్‌కు పంపించారు. దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్పటికీ పాత డిపోర్టేషన్ ఆదేశాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని ఆమె ఉదంతం మరోసారి వెలుగులోకి తెచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
సంక్రాంతి వేళ గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు..