Share News

ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసు.. మస్క్‌కు షాక్ ఇచ్చిన కోర్టు..

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:53 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌‌కు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా సోమవారం షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఇన్వెస్టర్లను మోసం చేశారనే కేసుకు సంబంధించిన జ్యూరీ తీర్పును రద్దు చేయాలని ఎలాన్ మస్క్ వేసిన పిటిషన్‌ను డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది.

ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసు.. మస్క్‌కు షాక్ ఇచ్చిన కోర్టు..
Twitter fraud verdict

న్యూయార్క్, జులై 7: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌‌కు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా సోమవారం షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఇన్వెస్టర్లను మోసం చేశారనే కేసుకు సంబంధించిన జ్యూరీ తీర్పును రద్దు చేయాలని ఎలాన్ మస్క్ వేసిన పిటిషన్‌ను డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది. కొనుగోలు ఒప్పందంపై మస్క్ మనసు మార్చుకున్నంత మాత్రాన, పెట్టుబడిదారులకు అబద్ధాలు చెప్పడం సరైనది కాదని విచారణ సందర్భంగా జడ్జి స్పష్టం చేశారు. 2022, మే 13వ తేదీన ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను ‘తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు’ మస్క్ చేసిన మొదటి ట్వీట్‌ అబద్ధం అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని జడ్జి చెప్పారు.


2022లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, మస్క్ చేసిన కొన్ని ట్వీట్ల కారణంగా కంపెనీ షేర్ల ధరలు పడిపోయాయి. షేర్ల ధరలు పడిపోవడంతో నష్టపోయిన ఇన్వెస్టర్లంతా కలిసి మస్క్‌పై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో క్లాస్ యాక్షన్ లాసూట్ వేశారు. ఇన్వెస్టర్ల కేసు కోర్టులో నడుస్తుండగానే, అటు ట్విట్టర్ యాజమాన్యం కూడా ఒత్తిడి తేవడంతో.. మస్క్ తప్పనిసరి పరిస్థితుల్లో పాత ధరకే ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినా.. మోసం కేసు అలాగే కొనసాగింది. కంపెనీలో నకిలీ, స్పామ్ (బోట్స్) ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని మస్క్ తప్పుడు ప్రచారం చేశారని ఇన్వెస్టర్లు ఆరోపించారు. ఆ తప్పుడు ఆరోపణల కారణంగా అత్యంత తక్కువ ధరలకే తమ షేర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.


కుదుర్చుకున్న ఒప్పందం నుంచి మస్క్ బయటపడటానికి ట్విట్టర్ బోట్స్ (స్పామ్ ఖాతాల) అంశాన్ని ఒక సాకుగా వాడుకున్నారని జ్యూరీ నిర్ధారించింది. ఈ విషయాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ ప్రస్తావించారు. జ్యూరీ తీర్పును ఆయన సమర్ధించారు. జ్యూరీ సభ్యులు తనను ఎగతాళి చేస్తూ వర్డిక్ట్ ఫారమ్‌పై '420' అనే సంఖ్యను హైలైట్ చేశారన్న మస్క్ వాదనను కూడా జడ్జి తోసిపుచ్చారు. కాగా, ఈ మోసం కేసులో మార్చి 20వ తేదీ నాటి తీర్పు ప్రకారం మస్క్ ఇన్వెస్టర్లకు దాదాపు 2.6 బిలియన్ డాలర్లు (21,000 కోట్ల రూపాయలకుపైగా) నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చని ఇన్వెస్టర్ల తరఫు న్యాయవాది అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ముంబైలో వర్షబీభత్సం

సహకార జీవిత బీమా సంస్థ

Updated Date - Jul 07 , 2026 | 07:26 AM