అమెరికా, కెనడా.. సుంకాల యుద్ధం!
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:55 AM
సుదీర్ఘకాలం మిత్రదేశాలుగా, అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న అమెరికా (యూఎస్ఏ), కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది...
వాషింగ్టన్/టొరంటో, ఆగస్టు 25: సుదీర్ఘకాలం మిత్రదేశాలుగా, అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న అమెరికా (యూఎస్ఏ), కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఇటీవల ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడం, దీనితో కెనడాపై తీవ్ర పదజాలంతో ట్రంప్ విమర్శలు, అదనపు సుంకాలు వేస్తున్నట్టు చేసిన ప్రకటన, ప్రతిగా అమెరికాపై ఆంక్షలకు కెనడా సిద్ధమవడంతో పరిస్థితి క్షీణించింది.
కెనడా కొల్లగొడుతోంది: ట్రంప్
వాణిజ్య ఒప్పందంపై చర్చలు విఫలమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ కెనడాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కెనడా చాలా ఏళ్లుగా అమెరికాను కొల్లగొడుతోందని, తమ రైతులు పండించిన పంటలపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని పేర్కొన్నారు. కెనడా తమకు అవసరం లేదని, ఆ దేశానికే తమ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు, వాటి విడిభాగాలు, ఉక్కుపై సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు.
ప్రతీకార సుంకాలు విధిస్తాం: కెనడా
ట్రంప్ సుంకాల ప్రకటన తమకు ఆశ్చర్యమేమీ అనిపించలేదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్కొన్నారు. కెనడా వాహన పరిశ్రమను నాశనం చేయాలని ట్రంప్ కోరుకుంటున్నారని ఆరోపించారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాకు విద్యుత్ సరఫరాను, కీలక ఖనిజాల ఎగుమతిని నిలిపివేస్తామన్నారు. అమెరికా సుంకాలతో కెనడాలో ప్రభావితమయ్యే వ్యాపారాలను ఆదుకుంటామని.. అమెరికాపై ఆధారపడిన రంగాలను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!