Share News

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మాస్కోలో భారతీయ కార్మికుడి మృతి

ABN , Publish Date - May 17 , 2026 | 07:09 PM

రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇవాళ రష్యా రాజధాని మాస్కో రీజియన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ జరిపిన అత్యంత భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి..  మాస్కోలో భారతీయ కార్మికుడి మృతి
Indian Worker Killed in Massive Ukraine Drone Attack on Russia’s Moscow Region

మాస్కో/న్యూఢిల్లీ, మే 17: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇవాళ (ఆదివారం) రష్యా రాజధాని మాస్కో రీజియన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ జరిపిన అత్యంత భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారికంగా ధృవీకరించింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ దాడిలో భారతీయుడితో పాటు మొత్తం నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

భారత రాయబార కార్యాలయం స్పందన:

ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన ముగ్గురు భారతీయ కార్మికులను మాస్కోలోని ఆసుపత్రిలో పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సహాయాన్ని పర్యవేక్షించారు.'ఈ రోజు మాస్కో రీజియన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం, ముగ్గురు గాయపడటం తీవ్ర విచారకరం. మృతుడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. బాధిత కార్మికులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సదరు కంపెనీ యాజమాన్యంతో, స్థానిక రష్యన్ అధికారులతో మా అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు' అని భారత ఎంబసీ 'X' వేదికగా ప్రకటించింది. అయితే, మరణించిన, ఇంకా గాయపడిన భారతీయుల వివరాలను (పేర్లు, సొంత రాష్ట్రం) భద్రతా కారణాల దృష్ట్యా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ దాడి:

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ రాత్రికి రాత్రే రష్యాలోని 14 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాదాపు 600కు పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) రాత్రి సమయంలో 556 డ్రోన్లను, తెల్లవారుజామున మరో 30 డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొన్నాయి.

అయినప్పటికీ, కొన్ని డ్రోన్ల శిథిలాలు మాస్కో శివార్లలోని నివాస ప్రాంతాలపై, బహుళ అంతస్తుల భవనాలపై పడటంతో భారీ నష్టం వాటిల్లింది. మాస్కోకు ఉత్తరాన ఉన్న ఖిమ్కి (Khimki) ప్రాంతంలో డ్రోన్ శిథిలాలు ఇళ్లపై పడి ఒక మహిళ మరణించగా, మైతిష్చి (Mytishchi) జిల్లాలోని పోగోరెల్కి గ్రామంలో ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులు కూడా ఈ దాడికి బలయ్యారు.

దాడి పూర్తిగా సమర్థనీయమే: జెలెన్స్కీ

ఈ భారీ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ.. రష్యాపై తాము చేసిన లాంగ్-రేంజ్ డ్రోన్ దాడులు పూర్తిగా సమర్థనీయమైనవేనని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 24 మంది పౌరులు మరణించిన సంగతిని గుర్తు చేస్తూ.. దానికి ప్రతికారంగానే తాము ఈ దాడులు చేశామన్నారు. 'రష్యా యుద్ధాన్ని పొడిగిస్తూ మా నగరాలపై చేస్తున్న దాడులకు మా సమాధానం ఇది. యుద్ధాన్ని ఆపాలని మేము రష్యన్లకు స్పష్టమైన సందేశం ఇస్తున్నాం.' అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.

మరోవైపు, రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. ఇదొక 'భారీ ఉగ్రవాద దాడి' అని అభివర్ణించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాల మధ్య నలిగిపోతూ అమాయక విదేశీ కార్మికులు, ముఖ్యంగా భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.


ఇవి కూడా చదవండి..

మోదీ అప్పీల్‌తో అధికారుల విదేశీ పర్యటనలపై గోవా సర్కార్ నిషేధం

తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విశాల్ ఎక్స్ పోస్టు..

Updated Date - May 17 , 2026 | 07:23 PM